కమల్ హాసన్ కు బిగ్ షాక్…బీజేపీలో చేరిన MNM ప్రధాన కార్యదర్శి

General secretary of Kamal Haasan’s party joins BJP మక్కల్ నీది మయ్యం (MNM)పార్టీ అధినేత కమల్ హాసన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో MNM పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఇవాళ పార్టీని వీడారు. కమల్ హాసన్ రెండో దశ ప్రచారం కార్యక్రమంలో బిజీగా ఉండగా.. అరుణాచలం పార్టీని వీడి బీజేపీలో చేరారు.
శుక్రవారం(డిసెంబర్-25,2020)చెన్నైలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు అరుణాచలం. రైతులకు ఉపయోగకరంగా ఉన్నందున నూతన సాగు చట్టాలకు మద్దతివ్వాలని తాను కమల్‌ను కోరానని..అయితే వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా అరుణాచలం విమర్శించారు.
తూటికోరిన్ జిల్లాకు చెందిన అరుణాచలం..తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో మక్కల్ నీది మయ్యం పార్టీకి పునాది వేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన ఎంఎన్‌ఎంను వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అరుణాచలం నిర్ణయం పార్టీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, రాబోయే ఎన్నికల కోసం కమల్ ఈ నెల ప్రారంభంలో తన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల్లో కజగం పార్టీలతో పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల కోసం పాలన ప్రణాళికను విడుదల చేశారు కమల్ హాసన్. గ్రీన్ చానల్ గవర్నమెంట్, ఆన్‌లైన్ హోమ్స్, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ అవకాశాలు అందించడం, మహిళల సుసంపన్నం వంటి తదితర పథకాలను ప్రకటించారు.