పుల్వామా ఉగ్రదాడి మా పనే…భారత్ ను గట్టిగా కొట్టామన్న పాక్ మంత్రి

Pak Minister Brags About Pulwama ఎట్టకేలకు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడింది తామేనని స్వయంగా పాకిస్తాన్ అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరిలో 40మంది భారత జవాన్లు అమరులైన పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ దే బాధ్యత అని స్వయంగా ఆ దేశ మంత్రి పేర్కొన్నారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజంను పాక్ ప్రోత్సహిస్తున్నట్లు స్వయంగా పాక్ మంత్రే ఆ దేశ పార్లమెంట్ లో చెప్పడం ఇప్పుడు కీలకంగా మారింది.
పాక్ జాతీయ అసెంబ్లీ(పాకిస్తాన్ పార్లమెంట్)లో మంత్రి ఫవాద్ చౌదరి మాట్లాడుతూ… భారత్ ను తన స్వంతగడ్డపైనే మనం కొట్టాం. పుల్వామాలో మన విజయం…ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రజల విజయం. మీరు..మేము అందరం ఈ విజయంలో భాగస్వాములం అని ఫవాద్ వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్రదాడి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వపు అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన అసెంబ్లీలో కలకలం రేపడంతో..తన మాటలను సవరించుకున్నాడు ఫవాద్. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ ను తన సొంత గడ్డపై మనం దెబ్బకొట్టాం అంటూ ఆయన తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశాడు.
కాగా, గతేడాది పుల్వామా ఘటన తర్వాత ఎల్ వోసీ వద్ద భారత్-పాక్ యుద్ధ విమానాల ఎన్ కౌంటర్ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా,విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి మధ్య జరిగిన సంభాషణ వివరాలను పాక్ విపక్ష నేత అయాజ్ సాధిఖ్ బయటకు వెల్లడించడంతో పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు మంత్రి ఫవాద్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.