గోవాలో పూర్తిస్థాయి లాక్ డౌన్..టూరిస్టులకు షాక్
కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Goa Announces Lockdown Till Monday Morning
Goa announces lockdown till Monday morning కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు విధించినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా రెండో దశ చాలా ప్రమాదకరమైనదని పేర్కొన్న గోవా సీఎం ప్రమోద్ సావంత్..గురువారం(ఏప్రిల్-29)సాయంత్రం నుండి సోమవారం(మే-3)ఉదయం వరకు గోవాలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రాసరీ స్టోర్ లు,అత్యవసర సేవలు,పారిశ్రామిక కార్యకలాపాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని సీఎం తెలిపారు. అదేవిధంగా అత్యవసర వస్తువుల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయన్నారు కానీ, ప్రజారవాణా మూతపడుతుందన్నారు. క్యాషినోలు, హోటళ్లు, పబ్‌లు కూడా మూసే ఉంటాయని చెప్పారు.
ఇక, ఇప్పటికే రాష్ట్రానికి వచ్చి ఉన్న పర్యాటకులు తమ తమ హోటళ్ల రూమ్ ల నుంచి బయటికొచ్చేందుకు అనుమతి లేదని,లాక్ డౌన్ సమయంలో వారందరూ తమ తమ నివాసాల్లోనే ఉండాల్సిందేనని తెలిపారు. రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకమని,ఈ నాలుగు రోజులు ప్రజలెవ్వరూ బయటకి రాకుంటే కోవిడ్ చైన్ ను బ్రేక్ చేయడంతో విజయం సాధిస్తామని సీఎం అన్నారు.
కాగా,రాబోయే 10 రోజుల్లో రాష్ట్రానికి రోజుకు 200 నుంచి 300 కోవిడ్ -19 సంబంధిత మరణాలు సంభవించే ప్రమాదం ఉందని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే పేర్కొన్నారు. మహమ్మారిని నియంత్రించడానికి లాక్ డౌన్ విధించక తప్పట్లేదన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ముఖ్యమని, అయితే ప్రాణాలను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని రాణే అన్నారు.