Maa Robot : కుమార్తెకు అన్నం తినిపించటానికి రోబో తయారు చేసిన కూలి .. ఏం తినాలని ఉందో చెబితే ముద్దలు కలిపి తినిపిస్తున్న ‘మా రోబో’..

దివ్యాంగురాలైన కుమార్తెకు అన్నం తినిపించటానికి రోబో తయారు చేశాడు ఓ రోజువారీ కూలి .. ఏం తినాలని ఉందో చెబితే ముద్దలు కలిపి తినిస్తోంది ఈ రోబో.

Maa Robot : కుమార్తెకు అన్నం తినిపించటానికి రోబో తయారు చేసిన కూలి .. ఏం తినాలని ఉందో చెబితే ముద్దలు కలిపి తినిపిస్తున్న ‘మా రోబో’..

Goa daily wage worker builds Maa Robot (1)

Goa daily wage worker builds Maa Robot : అతనో రోజువారీ కూలి..పనికి వెళితేనే కుటుంబం గడుస్తుంది. అటువంటి ఆ కూలికి అన్నీ కష్టాలే. సినిమా కష్టాలంటారే అటువంటివాటికి ఏమాత్రం తక్కువకాదు. రోగంతో మంచంపట్టిన భార్య..వికలాంగురాలైన కూతురు. వీరిద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. పనిలోకి వెళ్లాలి. కూతురు బాగోగులు చూసుకోవాలి. అవన్ని చూసుకునే భార్య కూడా మంచం పట్టటంతో అతనే అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అతనిపై పడింది. అవసరమే అన్నీ నేర్పిస్తుంది అనే మాటను మరో ఉదాహరణగా నిలిచాడు గోవాకు చెందిన 40 ఏళ్ల బిపిన్ కదమ్ అనే కూలి. పనికి వెళ్లి మధ్యలో తిరిగి వచ్చి కూతురుకి అన్నం తినిపించటం కష్టంగా మారింది. దీంతో ఎటువంటి సాఫ్ట్ వేర్ అవగాన కూడా లేని ఆకూలి కూతురుకి అన్నం తినిపించటానికి ఏకంగా ఓ రోబో తయారు చేశాడు. ఆ రోబోకు ‘మాబ్ రోబో’ (అమ్మ రోబో)అని పేరు పెట్టాడు. దివ్యాంగురాలైన తన కుమార్తెకు అన్నం తినిపించేందుకు వాయిస్ కమాండ్‌తో ఓ రోబోను తయారు చేసి టెక్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు.

దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోరా గ్రామానికి చెందిన బిపిన్ కదమ్ కు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. తన చేతులతో తాను భోజనం కూడా తినలేని కుమార్తెను చూసి బిపిన్ ఎంతగానో బాధపడేవాడు. ఆమె బాగోగులన్నీ భార్యే చూసుకునేది. కానీ గోరుచుట్టుమీద రోకటిపోటులా రెండేళ్ల క్రితం భార్య తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టింది. దీంతో కుమార్తెకు అన్నం తినిపించేవారు కూడా లేని పరిస్థితి. దినసరి కూలీ అయిన బిపిన్ ఉదయం పనికి వెళ్తే రాత్రికి ఇంటికి వచ్చేవాడు. దీంతో కూతురు కోసం ఏదైనా చేయాలని తపనపడేవాడు. ఏం చేయాలో పాలు పోలేదు. కుమార్తెకు అన్నం తినిపించేందుకు రోబో ఏమైనా దొరుకుతుందేమోనని మార్కెట్లో వాకబు చేశాడు. ఎటువంటి అవకాశం లేదు. పోనీ బిడ్డ బాగోగులు చూసుకోవటానికి కనీసం అన్నం తినిపించటానికి ఎవరైనా పనికి పెట్టుకుందామంటే అంతటి ఆర్థిక స్థితి లేకపోయే.దీంతో ఏదొకటి చేయాలనుకున్నాడు. అలా అతని తపనకు ప్రతిఫలంగా ‘అమ్మ రోబో’తయారైంది. ఎటువంటి సాఫ్ట్ వేర్ అవగాహ లేని ఓ అత్యంత సాధారణ కూలి ఓ రోబో తయారుచేయటం అంటే మాటలు కానేకాదు. అందుకే బిపిన్ టెక్ దిగ్గజాలకే ఆదర్శంగా నిలిచాడు.

బిపిన్ నాలుగు నెలల్లోనే పరిశోధనకు ప్రతిఫలంగా అతని కష్టం తీరింది. బిడ్డకు అన్నం తినిపించటానికి ఓ రోబో రూపొందింది. పెద్దగా చదువుకోని బిపిన్ కూలికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొచ్చాక రోబోను తయారుచేయడం ఎలా అన్నదానిపై నాలుగు నెలలపాటు పరిశోధన చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకుని..దానిపై అవగాహన పెంచుకున్నాడు. అలా నాలుగు నెలలు కష్టపడి ఓ రోబోను తయారుచేశాడు. పూర్తిగా వాయిస్ కమాండ్‌తో పనిచేసే దీనికి ‘మా రోబో’ (తల్లి రోబో) అని పేరు పెట్టాడు.

దాని చేతిలో ఆహారం ఉన్న పళ్లెం పెడితే అది కలిపి కుమార్తెకు తినిపించేలా డిజైన్ చేశాడు. అంతేకాదు..వాయిస్ కమాండ్ ద్వారా ఆహారాన్ని ఏ కూరతో కలిపి తినిపించాలో చెబితే రోబో అదే చేస్తోందీ మామ్ రోబో. అచ్చం అమ్మలాగా. అందుకే మామ్ రోబో అని పేరు పెట్టాడీ క్రియేటర్. ఈ రోబో విజయవంతంగా పనిచేస్తుండడంతో బిపిన్‌ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తన బిడ్డలాంటి పరిస్థితి ఉన్నవారికి ఇటువంటి రోబోలు తయారు చేస్తానంటున్నాడీ కూలి. కాదు కాదు టెక్ దిగ్గజాలనే ఆశ్చర్యపరిచిన ఓ సాధారణ తండ్రి. ఈ ఘనత వెలుగులోకి రావడంతో గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బిపిన్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయన తయారు చేసిన ‘మా రోబో’ను వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది.