పాక్ కు నీళ్లు ఇవ్వం : సింధూ జలాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2019 / 02:54 PM IST
పాక్ కు నీళ్లు ఇవ్వం : సింధూ జలాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

Updated On : February 21, 2019 / 2:54 PM IST

పుల్వామా ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. పాక్ తో ఇక చర్చలు ఉండవు చర్యలే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇప్పటికే పాక్ కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ని కూడా భారత్ ఉపసంహరించుకొంది. పాక్ నటులపై కూడా ఆల్ ఇండియా సినీ వర్కింగ్ అసోసియేషన్ బ్యాన్ విధించింది. ఇదే సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కీరీ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని గురువారం(ఫిబ్రవరి-21,2019) తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

సింధూ నది జలాల విషయంలో పాక్ కు వెళ్లే  మన దేశ వాటా నీటిని ఇకపై పాక్ కు వెళ్లనీయకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ నీళ్లను తూర్పు నదుల్లో నుంచి మళ్లించి మనదేశంలోని జమ్మూకాశ్మీర్,పంజాబ్ రాష్ట్రాల ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. రావి నదిపై షాపుర్ కాందీ డ్యామ్ ప్రాజెక్టును ప్రారంభినట్లు గడ్కీరీ తెలిపారు. యూజేహెచ్ ప్రాజెక్టు ప్రాంతంలో మన వాటా నీటిని నిల్వ చేసి జమ్మూకాశ్మీర్ ప్రజలకు అందిస్తామన్నారు. మిగులు జలాలను రావి-బియాస్ లింక్ ద్వారా పరివాహక ప్రాంతాలకు అందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులను పూర్తిగా జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 
గురువారం మధ్యాహ్నాం ఉత్తరాఖాండ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, 5వేల555 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సంలో గడ్కీరీ పాల్గొన్నారు. చాందీ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఆ సమయంలో కూడా సింధూ జలాల విషయంపై కొంత క్లారిటీ ఇచ్చారు. పాక్ లో ప్రవహిస్తున్న మూడు నదుల నీటిని త్వరలోనే భారత్ యమునా నదిలోకి మళ్లిస్తుందని అన్నారు. మనం ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే పాక్ లోని నదుల్లోకి నీరు ప్రవహించదన్నారు.
సింధు ఒప్పందం ప్రకారం..సింధు బేసిన్ లోని ఆరు నదుల్లోని నీటి వినియోగానికి సంబంధించి భారత్ మూడు,పాక్ మూడు నదులపై హక్కులు పొందాయి. రావి,బియాస్,సట్లెజ్ నదులపై భారత్ కు,జీలం,చీనాబ్,సింధు నదులపై పాక్ కు హక్కులున్నాయి. గతంలో ఉగ్రదాడులు జరిగిన సమయంలో కూడా సింధు జలాల ఒప్పందంపై చర్చ జరిగింది.