Cat Garden : పిల్లుల కోసం ప్రత్యేకంగా ఓ ఇల్లు..ఏసీ రూమ్ లు,మినీ థియేటర్ కూడా

గుజరాత్ కి చెందిన ఉపేంద్ర గోస్వామి అనే వ్యక్తి పిల్లుల కోసం ప్రత్యేకంగా ఓ ఇంటిని ఏర్పాటు చేశారు.

Cat Garden : పిల్లుల కోసం ప్రత్యేకంగా ఓ ఇల్లు..ఏసీ రూమ్ లు,మినీ థియేటర్ కూడా

Cat Home

Updated On : August 20, 2021 / 3:12 PM IST

Cat Garden గుజరాత్ కి చెందిన ఉపేంద్ర గోస్వామి అనే వ్యక్తి పిల్లుల కోసం ప్రత్యేకంగా ఓ ఇంటిని ఏర్పాటు చేశారు. “క్యాట్ గార్డెన్”గా పిలువబడే ఈ ఇల్లు కచ్ జిల్లాలోని గాంధీదామ్ లో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రతి ఆదివారం నాలుగు గంటలు విజిటర్స్ కోసం ఈ పిల్లుల ఇంటిని తెరుస్తారు. కనీస ప్రవేశ రుసుముతో సందర్శకులు ఈ పిల్లుల ఇంటిని సందర్శించవచ్చు.

గాంధీదామ్ సిటీలో నివసించే కస్టమ్ హౌస్ ఏజెంట్ గోస్వామి..2017లోనే ఈ క్యాట్ గార్డెన్ ని ఏర్పాటు చేశారు. 1994లో చనిపోయిన తన చెల్లికి ఆ క్యాట్ హౌస్ ని అంకితమిచ్చారు గోస్వామి. ప్రస్తుతం అందులో 200కి పైగా పిల్లులు ఉన్నాయి.

శుక్రవారం గోస్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…చనిపోయిన మా చెల్లి పుట్టినరోజుని ప్రతి ఏటా సెలబ్రేట్ చేస్తాం. ఒకసారి పిల్లి మా ఇంట్లోకి వచ్చి మా చెల్లి పుట్టినరోజు కోసం(చనిపోయిన తర్వాత) ఏర్పాటు చేసిన కేక్ ని తినింది. అప్పటినుంచి ఆ పిల్లి మా కుటుంబంలో భాగమైపోయింది. ఆ పిల్లినే మా చెల్లిగా భావిస్తున్నాం. పిల్లి రూపంలో మా చెల్లి మాతోనే నివసిస్తుందని నమ్ముతున్నాం. అప్పటి నుంచి మా కుటుంబం చాలా పిల్లులను పెంచడం ప్రారంభించింది. 2017లో పిల్లుల కోసం ప్రత్యేకంగా ఓ ఇంటిని ఏర్పాటుచేశాం. ప్రస్తుతం అందులో 200కి పైగా పిల్లులు ఉన్నాయి. అన్ని రకాల సౌకర్యాలను ఆ ఇంటికి కల్పించినట్లు చెప్పారు.

నాలుగు ఏసీ రూమ్ లు, 12 బెడ్స్ తో16 కాటేజీలు ఆ ఇంటిలో ఉన్నాయని గోస్వామి తెలిపారు. షవర్లతో పాటు మినీ థియేటర్ కూడా అందులో ఉందన్నారు. సాయంత్రం పూట జంతు సంబంధిత ప్రోగ్రామ్ లను పిల్లులు ఆ మినీ థియేటర్ లో చూస్తాయన్నారు. రోజుకి మూడుసార్లు వాటికి ఆహారం అందిస్తున్నామన్నారు. క్యాట్ ఫుడ్ లో బెస్ట్ బ్రాండెడ్ ఫుడ్ ని వాటికి అందిస్తున్నట్లు గోస్వామి చెప్పారు. పిల్లులకు తరచుగా వెటర్నరీ చెకప్ లు ఉంటాయన్నారు. దీనికోసం అహ్మదాబాద్ లోని జివ్ దయ ఛారిటబుల్ ట్రస్ట్ తమకు సహకారం అందిస్తుందన్నారు. ఈ పిల్లులు తమ కుటుంబంలో భాగమన్నారు.

కాగా,గోస్వామి భార్య స్కూల్ పిన్సిపల్ గా పనిచేస్తున్నారు. పిల్లుల ఇంటిని చూసుకునే విషయంలో తన భర్తకు సాయంగా ఆమె నిలుస్తున్నారు. ఆ పిల్లుల ఇంటి నిర్వహణకు నెలకు రూ.1.5లక్షలు ఖర్చు అవుతుండగా..గోస్వామి దంపతులు అందులో 90శాతం ఖర్చుని సొంతంగా భరిస్తున్నారు.