Happy Women’s Day 2019 : మహిళా నీకు వందనం

  • Published By: madhu ,Published On : March 8, 2019 / 01:16 AM IST
Happy Women’s Day 2019 : మహిళా నీకు వందనం

ఆకాశంలో సగం… అవకాశాలలో సగం అంటూ మహిళ దూసుకుపోతోంది అన్నది ఎవరూ కాదనలేని నిజం. బాధ్యతల బరువులు మోయడంలోనే కాదు… ప్రతి ఒక్కరి జీవితాలలో అంతా తానై అల్లుకుపోతోంది నేటి ఆధునిక మహిళ. అమ్మగా లాలించడమే కాదు… భార్యగానూ మగవారి జీవితంలో ఎన్నో మలుపులకు, విజయాలకు చేదోడుగానూ ఉంటోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అమ్మగా… ఆలిగా… కూతురుగా మగవాళ్ల జీవితంలో మహిళ పాత్రపై 10tv ప్రత్యేక కథనం…

9 నెలలు కడుపులో అపురూపంగా పెంచుకోవడంతోనే  మగువలోని అమ్మతనం మేల్కొంటుంది. కలల ప్రతిరూపం భూమిమీదకు రాగానే ప్రపంచాన్నే మరిచిపోయి కన్నబిడ్డ నవ్వులతో మురిసిపోయే అమ్మ… ఆ క్షణాన ఆమెకు బిడ్డే లోకంగా మారిపోతుంది. తన చిన్ని తండ్రికి ఏ చిన్న కష్టం రానీకుండా చూస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. చేతివేలు పట్టుకుని నడిచే బుడిబుడి నడకల జ్ఞాపకాలను, వచ్చీ రాని మాటలతో అలరించే చిన్నారుల చేష్టలను మదిలోనే భద్రంగా దాచుకుని మురిసిపోతుంది ఆ అమ్మ. 

తప్పటడుగులు వేసిన నాటి నుంచే తప్పులు చేయకుండా  తీర్చిదిద్దాలని…ప్రతిక్షణం బిడ్డకు బంగారు భవిష్యత్‌ ఇవ్వాలని ఆ కన్నతల్లి ఆరాటపడుతుంది. అందుకు ఎంతటి కష్టాన్ని అయినా దిగమింగుకుని బిడ్డ ఉజ్వల భవిష్యత్‌కు తనవంతు పాత్ర పోషిస్తూనే ఉంటుంది. అయితే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తనపిల్లలకు ఇబ్బందులు కలుగకుండా జీవితంలో ఉన్నత స్థాయిని ఇచ్చేంతవరకూ కంటిమీద కునుకు లేకుండానే జీవించందన్న విషయం చాలామంది కొడుకులకు తెలీకుండానే ఆ అమ్మ జీవితం సాగిపోతుంది. 

ప్రతీ కొడుకు ఎదుగుదలకు, ఉన్నత వ్యక్తిత్వాన్ని ఇవ్వడంలో తల్లి పాత్ర పూర్తవకముందే …ఆ జీవితంలో భార్య అనే హోదాలో వచ్చే  మహిళ మగవాడి లైఫ్‌లో చాలా  కీలకమైన పాత్ర పోషిస్తుంది. అప్పటి వరకూ అమ్మకు కొడుకుగా మాత్రమే ప్రపంచాన్ని చూడగలిగిన ఆ వ్యక్తి… భర్త అనే కొత్త పోస్ట్‌కు పరిపూర్ణ న్యాయం చేయాలంటే మాత్రం భార్య రోల్ చాలా ముఖ్యమన్న విషయం అందరికీ తెలిసిందే. 

అప్పటి వరకూ కొడుకు జీవితంలో ఏకచత్రాధిపత్యంగా ప్రేమను, కోపాన్ని, బాధను చెప్పగలిగే ఆ తల్లి… కొడుకు జీవితంలో వచ్చిన కోడలుకు అంతే స్థానం ఇస్తేనే ఆ ఇల్లు… ప్రేమాభిమాలతో హాయిగా సాగిపోతుంది. మహిళ తల్లిగా, భార్యగా తమ పాత్రలకు తమ వంతు న్యాయం చేయగలిగినపుడే ఆ కుటుంబం హ్యాపీగా గడపగలుగుతుంది. అత్తగారి స్థానాన్ని ఓ అమ్మగా మారి కోడలు అర్ధం చేసుకుంటూ… కోడలు పాత్రను ఒకప్పటి ఒకింటికి కోడలు అయిన తన పాత్రతో పోల్చుకుంటూ జీవిస్తూ చాలామంది హాయిగానే గడుపుతున్న కుటుంబాలను అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. అయితే ఒకప్పుడు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోయినా… చుట్టపుచూపుగా వచ్చిన అత్తా, కోడళ్లు సర్దుకుపోతూనే సంతోషంగా గడిపేస్తున్నారు. ఇది పరోక్షంగా మగవాడి జీవితంలో ఉన్నత స్థాయిని, హోదాను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని కూడా అత్తా, కోడళ్లు చక్కగానే అర్ధం చేసుకుంటున్నారు. 

ఇక పెళ్లయ్యాక వచ్చే కూతురు అనే మరో కొత్త అతిథి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపుతుంది. అలసిపోయి వచ్చిన నాన్న భుజాల మీదకు ఎక్కి ఆడుకోడమే కాదు.. నాన్న అలసటను ఉన్నపళాన ఊదేస్తూ సందడి చేస్తుంది. నిన్న కాక మొన్న పుట్టిన పాపాయి మరో ఇంటికి కోడలుగా వెళ్లే వరకూ కూతురుగా తన మనసులో ఎంత ప్రేమను  దాచుకున్నాడో ఆ తండ్రికి తెలీనంతగా మాయ చేస్తుందనడంలో సందేహమే లేదంటారు చాలామంది పేరెంట్స్‌.