కరోనా సామాజిక దూరం : చెట్టుపై అడ్వకేట్ నివాసం

కరోనా..మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. చైనా నుంచి వచ్చినఈ రాకాసి…భారతదేశాన్ని కూడా వణికిస్తోంది. వేలాది కేసులు నమోదవుతుండడం, వందకు పైగానే మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కు మందు లేదని, కేవలం సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించాలని నిపుణులు, వైద్యులు సూచించారు. అందులో భాగంగా ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతోంది.
దీనిని ఓ అడ్వకేట్ సవాల్ గా తీసుకున్నారు. అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎవరూ ఉండని ప్రదేశానికి వెళ్లలేదు. చెట్టుపైనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖుల్ త్యాగి న్యాయవాది. ఇతను హపూర్ ప్రాంతానికి చెందిన వారు. ఇతను అసురా గ్రామంలో ఓ పెద్ద చెట్టునే నివాసంగా ఏర్పాటు చేసుకున్నారు.
కొమ్మల నడుమ గూడు కట్టుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది. వైద్యుల సూచనల మేరకు సామాజిక దూరం పాటిస్తున్నానని ముఖుల్ వెల్లడించారు. కరోనా నుంచి రక్షించుకొనేందుకు తాను ఈ విధంగా చేయడం జరిగిందని, చెట్టుపై నివాసం ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు.
గుబురు..గుబురుగా ఉన్న ఈ పెద్ద చెట్టు కొమ్మల మధ్య ఉన్న ఇతను పుస్తకాలు చదువుతూ టైం పాస్ చేస్తున్నారు. మహాభారత్, ఇతర పుస్తకాలు చదువుతున్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వస్తే..కరోనా రాకాసి వల్ల ఎన్నో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. పదిహేను జిల్లాల్లో పూర్తిగా మూసి వేస్తున్నట్లుగా యుపీ ప్రభుత్వం ప్రకటించింది.
మూసివేత నిర్ణయంపై తిరిగి 13న సమీక్ష నిర్వహిస్తామని యూపీ చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ తివారీ తెలిపారు. ఇప్పటివరకు 332 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు, ఈ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్లు సమాచారం.