రాహుల్ గాంధీయే సాక్ష్యం: BJPలో ఒకే ఒక్క నిజాయతీపరుడు.. ఏ బటన్ నొక్కినా కమలానికే

రాహుల్ గాంధీయే సాక్ష్యం: BJPలో ఒకే ఒక్క నిజాయతీపరుడు.. ఏ బటన్ నొక్కినా కమలానికే

Updated On : October 21, 2019 / 8:23 AM IST

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ట్విట్టర్లో బీజేపీ ఎమ్మెల్యే వీడియో ఒకటి పోస్టు చేశారు. వీడియోతో పాటు బీజేపీలో ఉన్న ఒకే ఒక్క నిజాయతీపరుడు అంటూ కామెంట్ చేశారు. అందులో ఎవరికీ ఓటేద్దామని నొక్కినా సరే అది రూలింగ్ పార్టీ కమలానికే వెళ్తుందని ఎమ్మెల్యే అంటున్నాడు. 

హర్యానా ఎన్నికల జరుగుతున్న వేళ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే.. ఎమ్మెల్యే బక్షిష్ సింగ్ వీర్క్ హర్యానాలోని అసంద్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నాడు. ఇందులో భాగంగానే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న వీర్క్.. ఇలా మాట్లాడాడు. 

‘మీరు ఎవరికి ఓటు వేద్దామనుకున్నారో మాకు చెప్పండి. మాకు తెలీదు అనుకోకండి. మీకు చెప్పం కానీ, కావాలంటే మేం తెలుసుకోగలం. ఎందుకంటే మోడీ జీ చాలా తెలివైన వాళ్లు. మనోహర్ లాల్ (ముఖ్యమంత్రి) తెలివైన వాళ్లు. మీరు ఎవరికైనా ఓటు వేయండి. అది కచ్చితంగా కమలానికే వెళ్తోంది. అలా ఈవీఎం మెషీన్లను సెట్ చేశాం’ అని ప్రసంగించాడు. ఆయన మాటలకు కింద ఉన్న ప్రేక్షకులు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. 

ఈ వీడియో వైరల్ గా మారడంతో వీర్క్ ఇలా చెప్పుకొచ్చాడు. ఇదొక ఫేక్ వీడియో. ఎవరో మీడియా వ్యక్తి ఎడిటింగ్ చేసి పూర్తి విషయాన్ని మార్చేశారు. నాకు ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం ఉంది. ఓటింగ్ మెషీన్ల గురించి నేనెప్పుడూ చెప్పలేదు. ఈ ఆరోపణల్లో నిజం లేదు. నన్ను నా పార్టీపై నిందలు వేయాలనే ఇలా చేస్తున్నారని’ ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు.