కర్ణాటకను ముంచెత్తిన వరదలు : 15 మంది మృతి

ఎగువును కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తాయి. కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గడిచిన 3 నెలల కాలంలో రెండోసారి వరదముప్పును రాష్ట్రం ఎదుర్కోంటోంది. బుధవారం ఆల్మట్టి డ్యాం నుంచి సుమారు 3.75 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యాం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కృష్ణా, తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి.
కృష్ణా, ఉప నది మలప్రభ వరదల కారణంగా బాగల్‌కోట, బెళగావి, విజయపుర, యాదగిరి, రాయచూరు జిల్లాలు నీటమునిగి అతలాకుతలం అయ్యాయి. అత్యధికంగా బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకాలో పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునిగి జన జీవనం అస్తవ్యస్తమయ్యింది.
నీటిలో కొట్టుకుపోయి, మిద్దెలు కూలి ఇప్పటివరకు సుమారు 15 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. వేలాది హెక్టార్లలో పంటపొలాలు నీటమునిగాయి. బళ్లారి, రాయచూరు జిల్లాలో ముఖ్యమైన వంతెనలు నీటమునగడంతో రాకపోకలకు అంతారాయం ఏర్పడింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నీళ్లు, ఆహారం కోసం అలమటిస్తున్నారు. వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని సీఎం యడియూరప్ప జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.