దంచికొడుతున్న వర్షాలు.. తెలంగాణకు ఎల్లో.. కేరళకు రెడ్‌అలర్ట్ జారీ.. ముంబై, ఢిల్లీలోనూ కుండపోత వర్షం

నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కారణంగా కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

దంచికొడుతున్న వర్షాలు.. తెలంగాణకు ఎల్లో.. కేరళకు రెడ్‌అలర్ట్ జారీ.. ముంబై, ఢిల్లీలోనూ కుండపోత వర్షం

Rain

Updated On : May 26, 2025 / 4:05 PM IST

Heavy Rain: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శనివారం కేరళ రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకడంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకూ రుతుపవనాలు ఎంటర్ అయినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాలతో పాటు.. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

 

కేరళ రాష్ట్రంలో రెడ్ అలర్ట్..
కేరళ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే వారంరోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో కేరళలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 24గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. ఇక కేరళ తీరం వెంట గంటకు 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ప్రస్తుతం అలప్పుజ, ఎర్నాకులం, కన్నూర్, కాసర్ గోడ్, కొల్లం, కోజికోడ్, మలప్పురం, త్రిస్సూర్ తీర ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జాలర్లు ఎవరూ వేటకు వెళ్లకూడదని సూచించారు.

ముంబై అతలాకుతలం..
మహారాష్ట్రలోని ముంబయి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉరుములు, మెరుపులకుతోడు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ముంబైలోని నారిమన్ పాయింట్ ఫైర్ స్టేషన్ ప్రాంతంలో అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సోమవారం ఉదయం కావడంతో ఆఫీస్లకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ లో మోకాలి లోతు నీళ్లలో ఇరుక్కుని వాహనాలు ముందుకు కదలక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే ట్రాకులు నీళ్లలో మునిగిపోవడంతో రైళ్లు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సోమవారం అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో ఉండి, వారికి సహాయం అందించాలని ఆదేశించారు.

ఢిల్లీలోనూ దంచికొట్టిన వర్షం..
దేశ రాజధాని ఢిల్లీలోనూ వర్షం దంచికొట్టింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ధౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్ పురాలు నీట మునిగాయి. రాత్రి నుంచి ఉదయం వరకు అత్యధికంగా సఫ్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో అండర్ పాస్ ల వద్ద బస్సులు, కార్లు వర్షం నీటిలో చిక్కుకుపోయాయి. గంటకు 60 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.