వామ్మో..చిట్టెలుక ఎంత పనిచేసిందీ.!:ఇంటినే తగులబెట్టేసింది..! 

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 08:02 AM IST
వామ్మో..చిట్టెలుక ఎంత పనిచేసిందీ.!:ఇంటినే తగులబెట్టేసింది..! 

Updated On : October 29, 2019 / 8:02 AM IST

ఓ ఎలుక కొంపను తగులబెట్టేసిన విచిత్ర వెలుగులోకి వచ్చింది. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక చేసిన నిర్వాకంతో రెండు అంతస్థుల ఇల్లు కాస్తా కాలిపోయింది. ఈ ఘటన యూపీ బరెలీ పట్టణంలోని సుభాష్ నగర్ లో చోటుచేసుకోగా..ఇంటి యజమానితో పాటు అతని కుమారుడు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. 

వివరాల్లోకి వెళితే.. సుభాష్ నగర్ లోని బహతి గ్రామంలో సతీష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి రెండు అంతస్థుల ఇల్లు ఉంది. దీపావళి పండుగకు కుటుంబ సభ్యులు పైఅంతస్థులో దీపం వెలిగించారు. అలా వెలిగించిన దీపం వత్తిని ఓ ఎలుక నోట కరుచుకుని పట్టికెళ్లిపోయింది. అలా పట్టికెళ్లిన వత్తి నిప్పు  ఆరలేదు. వెలుగుతునే ఉంది. ఆ వత్తిని తీసుకెళ్లిన ఎలుక ఆ ఇంట్లోఉన్న గ్యాస్ సిలిండర్ పైప్ పై పెట్టింది. దీంతో సిలిండర్ పైప్ కాలిపోయింది. గ్యాస్ లీక్ అయ్యింది. సిలిండర్ పేలిపోయింది. 

గ్యాస్ సిలిండర్ పేలిపోవటంతో ఇంటిలో మంటలు చెలరేగాయి. ఆ మంటలకు ఇంటి యజమాని సతీష్ ..అతని కొడుకు సుభాష్ గాయపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఇదంతా కాలిపోయింది. గాయపడినవారిని కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో  జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సదరు బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన ట్రీట్ మెంట్ కోసం ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. ఈ ప్రమాదంపై సతీష్ మాట్లాడుతూ..ఇంటిలోని 45 వేల రూపాయల నగదు, విలువైన నగలు కాలిపోయాయని తెలిపారు. 

కాగా సతీశ్ కు జంతు ప్రేమ ఎక్కువ. దీంతో కోతి, ఆవు,ఎలుకలతో సహా అన్నింటికి ఆహారం పెడతుంటారు. తమ ఇంటి ఉంటున్న ఎలుకలకు కూడా ఆహారం పెడతాడు. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా తన ఇంటిలో ఎలుకలకు ఆహారం పెట్టాడు. అలా పెట్టిన కొంత సేపటికే ఈ ప్రమాదం జరిగిందని వాపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సతీశ్ ఇంటిని పరిశీలించగా గ్యాస్ సిలిండర్ పైప్ ను ఎలుక కొరికి వేసినట్లుగా..వెలుగుతున్న దీపం వత్తి వల్లనే గ్యాస్ సిలిండర్ పేలిపోయి ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు.