ఎంతకాలం తాత్సారం: అయోధ్యకేసు వాయిదా

  • Published By: chvmurthy ,Published On : January 27, 2019 / 02:47 PM IST
ఎంతకాలం తాత్సారం: అయోధ్యకేసు వాయిదా

ఢిల్లీ:  అయోధ్య రామజన్మభూమి వివాదంపై జనవరి 29 నుంచి జరగాల్సిన విచారణ మళ్ళీ వాయిదా పడింది.  రామజన్మభూమి వివాదంపై దాఖలైన పిటీషన్లు విచారించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కొత్త ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు న్యాయమూర్తులను జనవరి 25న మార్చారు. బెంచ్ లోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన ఎస్.ఏ.బాబ్డే  జనవరి29న  అందుబాటులో లేకపోవటంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు ఆదివారం సుప్రీంకోర్టు తెలిపింది.  
ఇంతకుముందు అయోధ్య కేసు విచారించే ఐదుగురి సభ్యుల ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ యు యు లలిత్‌ ఈ కేసు నుంచి తప్పుకోగా, జస్టిస్‌ ఎన్‌వి రమణను కొత్త బెంచ్‌ నుంచి పక్కనబెట్టారు. వీరి స్ధానంలో కొత్తగా జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ నజీర్‌లను తీసుకున్నట్టు ఈనెల 25న ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ప్రకటించారు. 
అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ  జరిపేందుకు  ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు అక్టోబర్ 29న ప్రకటించింది. కాగా 29 నుంచి ప్రారంభం కావల్సిన విచారణ బెంచ్లోని ఒక న్యాయమూర్తి అందుబాటులో లేక పోవటంతో మళ్లీ వాయిదాపడింది.
కాగా… అయోధ్య  రామమందిరం కేసును వీలైనంత త్వరలో తేల్చాలని, తాత్సారం తగదని, దీనివల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకంపోయే ప్రమాదముందని , లేని పక్షంలో మాకు అప్పగిస్తే 24 గంటల్లో పరిష్కరిస్తామని  యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ శనివారం వ్యాఖ్యానించారు.