ఓటర్ల మైండ్‌ సెట్‌ ఎలా ఉంది.. ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు?

ఆప్‌కీ బార్‌ చార్‌ సౌ పార్‌.. అనే నినాదంతో 400 సీట్ల మార్క్‌ను దాటి తీరాలని కంకణం కట్టుంది. మరి ఈసారి దేశంలో పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా..? ఓటర్ల మైండ్‌ సెట్‌ ఎలా ఉంది..?

ఓటర్ల మైండ్‌ సెట్‌ ఎలా ఉంది.. ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు?

Indian Voters Mind: సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌, మేలో జరిగే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను రచిస్తున్నాయి అన్ని పార్టీలు. అయితే బీజేపీ మాత్రం 2019కి మించిన విక్టరీ కోసం సమర సన్నాహాలను చేసుకుంటోంది. మరి ఓటర్ల మైండ్‌ సెట్‌ ఎలా ఉండబోతోంది..? ఓటర్లను ప్రభావితం చేసే కీలకమైన అంశాలేవి..? ఎమోషన్స్‌కు ప్రాధాన్యమిస్తారా..? లేక లాజికల్‌గా ఆలోచిస్తారా..?

2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 45 శాతం ఓట్‌షేర్‌, 543 సీట్లకు 353 సీట్లు సాధించింది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలందుకున్నారు. దీనికి రాజకీయ విశ్లేషకులు చాలా రకాల కారణాలనే విశ్లేషించారు. ప్రధానంగా మోదీ ఫేస్‌, ఎన్డీయే సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలు, బీజేపీ క్షేత్రస్థాయిలో చేసిన పోల్‌ మేనేజ్‌మెంట్‌, హిందూత్వ ఎజెండా, జాతీయవాదంతో పాటు ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు, సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎన్డీయే విజయానికి కారణమయ్యాయని అంటున్నారు.

ఓటర్ల వ్యూ ఎమోషనల్‌గా ఉంటుందా..?
ఈసారి కూడా 2024 ఎన్నికలకు బీజేపీ పెద్ద టార్గెట్‌నే నిర్దేశించుకుంది. ఆప్‌కీ బార్‌ చార్‌ సౌ పార్‌.. అనే నినాదంతో 400 సీట్ల మార్క్‌ను దాటి తీరాలని కంకణం కట్టుంది. మరి ఈసారి దేశంలో పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా..? ఓటర్ల మైండ్‌ సెట్‌ ఎలా ఉంది..? ఏయే అంశాలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి? ఎన్నికల్లో ఒక పార్టీ భారీ మెజారిటీతో గెలవడానికి, మరొక పార్టీ ఘోరంగా ఓటమిని చవిచూడటానికి కారణమేంటి? ఓటర్ల వ్యూ ఎమోషనల్‌గా ఉంటుందా..? తార్కిక ధోరణిలో ఉంటుందా..? సామాజిక ఉద్యమాలు, అల్లర్లు, నిరసనలు ఇలాంటి అంశాలను ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారా?

రాజకీయ పండితులు మాత్రం కొన్ని కీలకమైన అంశాలు ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. మహిళలు, యువత, రైతులు, దేశ ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలు, కులాలు, మతాలు, వర్గాలు.. ఇలాంటి అంశాలే ఓటర్లపై ప్రధానంగా ఎఫెక్ట్‌ చూపుతాయనేది వాళ్ల వాదన. ఇవికాకుండా దేశవ్యాప్త పరిణామాలను కూడా ఇప్పటి ఓటర్లు ఓ కంట కనిపెడుతూనే ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

జనం ఎక్కువగా ఆలోచించేది వీటి గురించే..
జాతీయ రాజకీయాలకు, రాష్ట్రాల్లో స్థానిక రాజకీయాలకు మధ్య తేడా ఉంటుంది. జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ, ధరలు, కేంద్రం తీసుకునే నిర్ణయాలపట్ల ప్రజల్లో సానుకూల, వ్యతిరేక భావనలు.. ఇలా చాలా అంశాలు ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంటాయి. 2016లో నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సంచలనం రేపింది. కానీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకే కేంద్రంలో పట్టం కట్టారు ప్రజలు. అంటే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దానివల్ల చోటుచేసుకున్న ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు, వాటి ప్రభావం ఓటర్లపై పెద్దగా లేదనే చెప్పాలి. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలవల్ల తమకు ఏదైనా నష్టం కలిగిందా..? లేక లబ్ది చేకూరిందా..? వీటిపైనే జనం ఎక్కువగా ఆలోచిస్తుంటారనేది స్పష్టమవుతోంది.

ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పులు, సామాజిక, రాజకీయ పరిణామాలనేవి దేశంలో ఎన్నికలపై ఎప్పుడూ ప్రభావితం చూపేవే. అయితే భావోద్వేగాలు రాజకీయాలపై ప్రభావితం చూపవా..? అంటే కొన్ని సార్లు ఇవి కూడా ఎఫెక్ట్‌ చూపే అవకాశాలు లేకపోలేదు. ఇంతకీ ఎలాంటి సందర్భాల్లో భావోద్వేగాలతో ముడిపడిన రాజకీయాలు సానుకూల ఫలితాలను సాధిస్తాయి..? అంటే మొదటిది.. ప్రపంచం, దేశంలో చోటుచేసుకునే కీలక పరిణామాలు. ఇవి ఆ దేశ ప్రజలపై ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతాయి. రెండోది.. ఒక సామాజిక సమూహంపై తీవ్రమైన ప్రభావం చూపే నిర్ణయాలు.. భావోద్వేగంతో కూడిన రాజకీయాలు. మూడోది.. మారుతున్న సమాజం పట్ల సానుకూల దృక్పథం.. ఇలాంటివి రాజకీయాలపై ఎఫెక్ట్‌ చూపుతాయి.

Also Read: లిక్కర్ కేసు డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ కోర్టులో చెబుతారు: సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

స్వాతంత్ర్యం తర్వాత 1951-52 మధ్య జరిగిన ఎన్నికలు భావోద్వేగ రాజకీయ పరిస్థితులకు చక్కటి ఉదాహరణ. స్వాతంత్ర్య పోరాటంలో కీలక భూమిక పోషించిన కాంగ్రెస్‌ పార్టీ వెంట ప్రజలు నడిచారు. అప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ దేశానికి తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు. 489 పార్లమెంట్‌ సీట్లలో 364 సీట్లను నెహ్రూ సారథ్యంలో నేషనల్‌ కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. అంటే అప్పట్లో 45 శాతం ఓట్‌ షేర్‌ను పొందింది కాంగ్రెస్‌.

ఆ తర్వాత రెండో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఓట్‌ షేర్‌ను 47 శాతానికి పెంచుకోగలిగింది. 371 సీట్లను రెండోసారి ఎన్నికల్లో దక్కించుకుంది. 1971లో ఇందిరాగాంధీ సారథ్యంలో 43 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు దక్కాయి. 352 సీట్లను చేజిక్కించుకుంది కాంగ్రెస్‌. ఈ మూడు వరస ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు దేశ ప్రజలు వెన్నంటి ఉండి మద్దతు పలకడం వల్లే ఇది సాధ్యమైంది. స్వాతంత్ర్యం అనంతర భావోద్వేగంతో ఉన్న దేశ పరిస్థితులు, ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సంస్కరణలు, ఇతర దేశాలతో సత్సంబంధాలు ఇలాంటి అంశాలు కూడా ప్రజలు అవగాహన చేసుకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

Also Read: వాషింగ్ మెషీన్‌లో డబ్బుల కట్టలు.. వాటిని ఉతకడానికి పెట్టారా ఏంటీ?

ఇక ఇప్పటి రాజకీయాల్లోకి వస్తే.. ఈసారి హ్యాట్రిక్‌పై మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌ ఫుల్‌ ఫోకస్‌ చేసింది. తాము చేసిన ఆర్థిక సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని కొత్త పాలసీలు, మార్పులు, యువత, రైతులకు చేకూర్చుతున్న లాభం, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు, కశ్మీర్‌ అంశం, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఇలా పలు అంశాలు తమకు సానుకూలంగా అవుతాయని భావిస్తోంది.

గ్యారంటీ హామీల సక్సెస్‌ ఫార్ములా
కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీ హామీల సక్సెస్‌ ఫార్ములాను దేశవ్యాప్తంగా కూడా అమలుచేస్తామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ఇందులో హిస్సేదారి న్యాయ్ అంటూ బడుగు,బలహీనవర్గాలకు సామాజిక న్యాయం చేకూరేలా మ్యానిఫెస్టో రూపకల్పన చేస్తోంది కాంగ్రెస్‌. రైతు సమస్యల పరిష్కారానికి కిసాన్‌ న్యాయ్‌, కార్మికులు, ఉద్యోగుల కోసం శ్రామిక్‌న్యాయ్‌, యువత భవిష్యత్తుకు భరోసాగా యువ న్యాయ్‌, మహిళలకోసం నారీ న్యాయ్‌ పేరుతో పాంచ్‌ న్యాయ్‌ మ్యానిఫెస్టో కసరత్తు చేస్తోంది. వీటి ద్వారా రైతులు, కార్మికులు, దళితులు, యువకులు, స్రీలు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకోవచ్చనేది కాంగ్రెస్‌ ధీమాగా ఉంది.

Also Read: వీఐపీలకు కేరాఫ్ తీహార్ జైల్.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

అయితే స్వాతంత్ర్యానికి పూర్వం పరిస్థితులు, స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో నెలకొన్న పరిణామాలు వేరు. ఇప్పుడు ప్రజల ఆలోచనా విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయి. మరి ప్రజలు ఎన్డీయే ప్రభుత్వ విధానాలపట్ల సంతృప్తిగా ఉన్నారా..? లేదా..? ఓటర్ల నాడి ఎలా ఉండబోతోంది..? అనేది తెలియాలంటే జూన్‌ నెలలో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.