మోడీని చూస్తే చాలా భయమేస్తోంది

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు చాలా భయంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవాద్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019) మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం పరిధిలోని దౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొన్నారు. బారామతి నుంచి పవార్ కూతురు సుప్రియా సూలే మరోసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ర్యాలీలో పవార్ మాట్లాడుతూ….నా వేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని మోడీ చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నాకు చాలా భయం వేస్తోంది. ఎందుకంటే, ఆయన ఏం చేస్తారో ఎవరికీ తెలియదని శరద్ పవార్ అన్నారు.యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందని బీజేపీ అడుగుతోందని, అయితే బీజేపీ తాను అధికారంలో ఉన్న సమయంలో ఏం చేసిందో చెప్పడం లేదని అన్నారు.మహారాష్ట్రలో ఏడు బహిరంగ సభల్లో మోడీ మాట్లాడారని,తనపైనే మోడీ విమర్శలు గుప్పించారని అన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి సంబంధించిన విషయాలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చినప్పుడు యూపీఏ ప్రభుత్వంలో సీనియర్ మినిస్టర్ అయిన శరద్ పవార్ తనకు చాలా హెల్ప్ చేశారని గతంలో మోడీ అన్న విషయం తెలిసిందే.