Why India Mango Rejected: 25 మెట్రిక్ టన్నుల భారత మామిడి పండ్లను అమెరికా ఎందుకు తిరస్కరించింది? తప్పు ఎవరిది..

లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటాతో సహా అమెరికాలోని ప్రధాన ఎంట్రీ పాయింట్ల వద్ద ఎగుమతులు నిలిచిపోయాయి.

Why India Mango Rejected: 25 మెట్రిక్ టన్నుల భారత మామిడి పండ్లను అమెరికా ఎందుకు తిరస్కరించింది? తప్పు ఎవరిది..

Updated On : May 21, 2025 / 7:17 PM IST

Why India Mango Rejected: భారత మామిడిని అగ్రరాజ్యం అమెరికా తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా నిర్ణయం వల్ల మన రైతులు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఏకంగా 15 మామిడి షిప్ మెంట్లను తిరస్కరించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసలు అమెరికా ఇలా ఎందుకు చేసింది? తప్పు ఎవరిది? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా, అమెరికన్ ఇన్ స్పెక్టర్లు ప్రామాణిక తనిఖీ ప్రోటోకాల్‌ను పాటించడంలో విఫలమయ్యారని భారత్ ఆరోపించింది. ఈ విధానపరమైన లోపం వల్ల ఎగుమతిదారులు మామిడి సరుకును అక్కడే ధ్వంసం చేయాల్సి వచ్చిందని, గణనీయమైన ఆర్థిక నష్టం కలిగిందని వాపోయింది.

మామిడి పండ్లు త్వరగా పాడైపోయే స్వభావం, తిరిగి పంపే రవాణ ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల… అమెరికాలో తిరస్కరించబడిన పండ్లను అక్కడే నాశనం చేయాలని ఎగుమతిదారులు నిర్ణయించారు. ఫలితంగా రూ.4 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా.

ముంబైలో మామిడి ఎగుమతులకు కీలకమైన ఇర్రేడియేషన్ సౌకర్యాలలో ఒకటైన మహారాష్ట్ర రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు (MSAMB) దీనిపై స్పందించింది. “అమెరికా ఇన్ స్పెక్టర్లు తొందరపడ్డారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఏజెన్సీలతో ఈ విషయాన్ని చర్చించలేదు. అమెరికాలోని వారి సీనియర్ కార్యాలయాలకు నేరుగా నివేదించారు. ఫలితంగా 15 షిప్ మెంట్ల మామిడి పండ్లు తిరస్కరించబడ్డాయి” అని తెలిపింది.

తిరస్కరించబడిన కన్ సైన్‌మెంట్లలో 10 మంది ఎగుమతిదారుల పంపిన 25 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు ఉన్నాయి. మే 8, 9 తేదీలలో MSAMB సౌకర్యం వద్ద ఇర్రేడియేషన్‌ చేయబడ్డాయి. MSAMB ప్రకారం, అమెరికాకి మామిడి ఎగుమతికి అవసరమైన క్లియరెన్స్ డాక్యుమెంట్, PPQ203 జారీ చేయడానికి ముందు ఇన్ స్పెక్టర్లు తమను సంప్రదించి ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యేదని అభిప్రాయపడింది.

Also Read: పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం.. హోంమంత్రి ఇంటికి నిప్పు.. జనంపై కాల్పులు.. రచ్చ రచ్చ

లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటాతో సహా అమెరికాలోని ప్రధాన ఎంట్రీ పాయింట్ల వద్ద ఎగుమతులు నిలిచిపోయాయి. ఆ పండ్లు ఇర్రేడియేషన్‌ చేయబడ్డాయి. ఇర్రేడియషన్ అంటే.. తెగులు నిర్మూలన ప్రక్రియ. ముంబైలోని USDA నియమించిన ఇన్ స్పెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగిందని వివరించారు.

ఇర్రేడియేషన్ ఎక్స్‌పోజర్ స్థాయిలను ట్రాక్ చేయడానికి ఉపయోగించే డోసిమీటర్ రీడింగ్‌లను తనిఖీ ప్రక్రియలో ఫెసిలిటీ సిబ్బంది సరిగ్గా నమోదు చేయలేదని తెలుస్తోంది. తాత్కాలికంగా ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ముంబై ఇర్రేడియేషన్ ఫెసిలిటీలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
మే 11 నుంచి 18 మధ్య, ముంబై ఫెసిలిటీ నుండి మామిడి ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. 53,072 బాక్స్‌లు – 185.75 మెట్రిక్ టన్నులకు సమానం. 39 కన్ సైన్‌మెంట్‌లలో అమెరికాకు రవాణ చేయబడ్డాయని MSAMB నివేదించింది.

భారత్ ప్రస్తుతం అమెరికాకు మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి 3 యుఎస్‌డిఎ-ఆమోదించిన ఇర్రేడియేషన్ ఫెసిలిటీలను ఉపయోగిస్తోంది. అవి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఉన్నాయి.

ఇటీవలి ఎదురుదెబ్బ తగిలినా.. అమెరికాకు భారత మామిడి ఎగుమతులు వేగంగా జరుగుతున్నాయి. FY24లో ఎగుమతి విలువ 130 శాతం పెరిగి 10 మిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇది 4.36 మిలియన్ డాలర్లు. అల్ఫోన్సో, కేసర్, బంగనపల్లి, హిమాయత్ వంటి మామిడి రకాలు ఇప్పటికే అమెరికాలో మార్కెట్ యాక్సెస్‌ను పొందాయి. ఉత్తర భారత రకాలైన రాస్పురి, లాంగ్రా, చౌసా, దశేరి ఇర్రేడియేషన్ చికిత్స కోసం కూడా అనుమతి పొందాయి.