ఇండియా ఖతర్నాక్ ప్లాన్.. బోర్డర్ లోనే కాదు.. ఏకంగా ఆకాశం నుంచి భారత్ నిఘా.. 52 శాటిలైట్లతో.. చైనా, పాక్ కు వణుకే..
ఎస్‌బీఎస్-3 ద్వారా చైనా, పాకిస్థాన్, హిందూ మహాసముద్ర పరిధిలోని ప్రాంతాలను విస్తృతంగా కవర్ చేస్తారు.

దేశ భద్రత కోసం 2029 చివరిలోపు 52 ఉపగ్రహాల ఉత్పత్తి, ప్రయోగాలు చేపట్టేలా పనులు వేగంగా పూర్తిచేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), మూడు ప్రైవేట్ కంపెనీలను కేంద్ర సర్కారు ఆదేశించింది. ఇందులో భాగంగా మొదటి ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగించనున్నారు. 52 ఉపగ్రహాల్లో 21 శాటిలైట్లను అభివృద్ధి చేసి, ప్రయోగించే బాధ్యత ఇస్రోపై ఉంది. మిగతా ఉపగ్రహాలను మూడు ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తాయి.
ఆయా ఉపగ్రహాలను త్వరగా లో ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టేందుకు గడువులను కుదించే పనిలో ఉన్నామని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఉపగ్రహాల తయారీ కోసం ఒప్పందం చేసుకున్న మూడు ప్రైవేటు కంపెనీలకు కూడా ఈ మేరకు ఆదేశాలు అందాయని చెప్పాయి.
ఉపగ్రహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆ మూడు కంపెనీలను చెప్పినట్లు తెలిపాయి. రూ.26,968 కోట్ల వ్యయంతో చేపట్టిన స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ (ఎస్‌బీఎస్) ప్రోగ్రాం 3వ దశలో భాగంగా ఈ ప్రాజెక్ట్ జరుగుతోంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ 2023 అక్టోబర్‌లో దీనికి ఆమోద ముద్ర వేసింది. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలో డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఈ ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టే మిషన్‌కు నేతృత్వం వహిస్తోంది.
ఈ ప్రాంతాలపై నిఘా
ఎస్‌బీఎస్-3 ద్వారా చైనా, పాకిస్థాన్, హిందూ మహాసముద్ర పరిధిలోని ప్రాంతాలను విస్తృతంగా కవర్ చేస్తారు. తక్కువ రివిజిట్ టైం, మెరుగైన రిజల్యూషన్ దీని లక్ష్యం. అంతరిక్ష వ్యూహాన్ని సైతం మెరుగుపరిచే పనిలో భారత్ ఉంది.
ఉపగ్రహాల ప్రాజెక్టుతో పాటు, సైనిక అవసరాల కోసం సమగ్ర అంతరిక్ష వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశీయ కార్టోసాట్ ఉపగ్రహాలు, విదేశీ కమర్షియల్ ఉపగ్రహాల సాయంతో పాకిస్థాన్ సైనిక చర్యలను ట్రాక్ చేశారు.
ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ మే 12న ఇంఫాల్‌లోని సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మాట్లాడుతూ.. 10 ఉపగ్రహాలు 24 గంటలు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయని చెప్పారు. దేశ ప్రజల రక్షణ, భద్రతకు ఇవి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. భారత్‌కి ఉన్న 7,000 కి.మీ తీరరేఖ, ఉత్తర సరిహద్దులపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ కుమార్ గోయెన్‌కా కూడా భారత్ 5 ఏళ్లలో 52 ఉపగ్రహాల కన్స్టిలేషన్ ప్రవేశపెట్టే ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించారు.
చైనా సైనిక అంతరిక్ష సామర్థ్యం వేగంగా పెరుగుతోంది. 2020లో 36 ఉపగ్రహాలు ఉండగా, 2024 నాటికి 1,000కు పైగా చేరాయి. వీటిలో 360 ఉపగ్రహాలు ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రీకానసెన్స్‌కు ఉపయోగపడుతున్నాయి.