India US Trade Deal : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. భారత్‌కు కలిగే లాభాలేంటి? ఏఏ రంగాలకు ఎక్కువ ప్రయోజనం
India-US Trade Deal : ప్రాథమిక స్థాయిలో భారతీయ వస్తువులపై యూఎస్ సుంకాలను తగ్గించడం వలన యూఎస్ దిగుమతిదారులు చెల్లించే ధర మారుతుంది.
India-US, Trade Deal
India US Trade Deal : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు శుభవార్త చెప్పారు. గతేడాది ఎడాపెడా పెంచిన టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం విధించిన టారిఫ్‌లు 25శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సోషల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను.. ఆయన నాకు మంచి స్నేహితుడని చెప్పారు. అంతేకాదు శక్తిమంతమైన నాయకుడు అంటూ మోదీని కీర్తించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేందుకు.. అమెరికా, వెనెజువెలా నుంచి కొనుగోలు చేయడానికి మోదీ అంగీకరించారని ట్రంప్ వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది అని ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
భారత్ పై ప్రతీకార టారిఫ్‌లను 25శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్‌నకు పెద్ద ధన్యవాదాలు” అని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు.
ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులపై గతంలో ఉన్న టారిఫ్ భారం 18శాతానికి తగ్గుతుంది. అయితే, అందరూ అనుకున్నట్లుగా అన్ని రంగాలకు ఈ ఊరట లభించలేదు. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే అనేక ఉత్పత్తులపై పన్నులు తగ్గుతాయని మనం ఆశించాం. వాటిలో స్మార్ట్ ఫోన్లు, విమాన విడిభాగాలు, ఫార్మా ఉత్పత్తులకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, భారత పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా నిలిచే స్టీల్, అల్యూమినియం రంగాలకు మాత్రం ఆశించిన స్థాయిలో ఊరట లభించలేదని తెలుస్తోంది.
అమెరికా టారిఫ్ తగ్గింపు కారణంగా.. అమెరికా నుంచి వచ్చే వస్తువుల రిటైల్ ధరలు తగ్గుతాయి. పపు ధాన్యాలు, డైరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గుతాయి. దీనివల్ల పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం మధ్య వినియోగదారులకు ధరల ఉపశమనం లభిస్తుంది.
ల్యాప్టాప్స్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ వంటి టెక్ హార్ద్‌వేర్, కాంపోనెంట్స్ కూడా భారత మార్కెట్లో తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. సీఫుడ్ .. రొయ్యలు, చేపల ఎగుమతులపై పన్ను 25శాతం నుంచి 18శాతానికి తగ్గుతుంది. దీంతో మత్స్యకారులకు, ఎగుమతిదారులకు భారీ లాభం కలగనుంది.
అదేవిధంగా.. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ విడిభాగాలు, మందుల ఎగుమతులకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఈ డీల్ ప్రకటన వెలువడగానే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 1శాతంకుపైగా పెరిగింది. 90.40 వద్దకు చేరుకోవడం మన ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామం అని చెప్పొచ్చు. మరోవైపు.. సుంకాలను 25శాతం నుంచి 18శాతంకు తగ్గించడం కారణంగా.. భారతీయ ఆభరణాల ఎగుమతుల ధర తగ్గుతుంది. మార్జిన్లపై ఒత్తిడి తగ్గుతుంది.
