కుల్ భూషణ్ ని కలిసిన భారత అధికారి

పాక్ జైల్లో మగ్గుతున్న ఇండియన్ నేవీ మజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా కలిసారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో జాదవ్‌ను కలిసేందుకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. 2017 తర్వాత తొలిసారిగా భారత అధికారులు కుల్‌భూషణ్‌ను కలిసారు.
భారత్ నౌకాదళంలో అధికారిగా పదవీ విరమణ చేసిన కులభూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ గూఢచర్యం కేసులో అరెస్టు చేసి.. ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఈ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఉరి శిక్షను నిలుపుదల చేయడంతో ప్రస్తుతం జాదవ్ పాక్ జైల్లోనే మగ్గుతున్నాడు.
జాదవ్ కు దౌత్యపరమైన సాయం అందించేందుకు మూడేళ్లుగా భారత్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్థాన్ మోకాలడ్డుతూ వస్తోంది. అంతర్జాతీయ కోర్టు మొట్టికాయలు వేయడంతో ఎట్టకేలకు దిగివచ్చిన పాక్ జాదవ్‌ను భారత డిప్యూటీ హైకమిషనర్ కలిసేందుకు అంగీకరించింది. దీంతో ఇవాళ ఆహ్లూవాలియా జాదవ్ ని కలిసి మాట్లాడారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.