రిఫండ్ గడువు పెంచిన రైల్వే

రిఫండ్ గడువు పెంచిన రైల్వే

Updated On : January 8, 2021 / 12:21 PM IST

Refund On Cancelled Train Tickets గతేడాది కోవిడ్ లాక్​డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్​ ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఇప్పటివరకు గడువు ఉండగా…ఆ గడువుని 9 నెలలకు సొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కొవిడ్​ దృష్ట్యా కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు గురువారం రైల్వే మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి-21,2020 నుంచి జులై-31,2020 మధ్య రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్​ పొందే గడువును 9 నెలలకు పొడిగిస్తున్నాము. రోజువారిగా నడిచే రైళ్లకే ఈ రిఫండ్ వర్తిస్తుంది. ఈ ఆరు నెలల గడువులో ఎంతో మంది రిఫండ్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందరికీ పూర్తి స్థాయిలో రిఫండ్ అందుతుందని ఆ ప్రకటనలో రైల్వేశాఖ తెలిపింది.

మరోవైపు, సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడిపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్-ధనపూర్, పూరి-యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ నెల 6 నుంచి మార్చి 31 వరకు ఈ రైళ్లు నడుస్తాయి. ఈనెల 8 నుంచి 16 వరకు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ వరకు ఒక రైలును నడుపుతారు. అయితే, తిరుగు ప్రయాణంలో మరో రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వరకు ప్రత్యేక రైలు ఈనెల 12న నడస్తుంది. ఈనెల 9వ తేదీ నుంచి 31 వరకు విశాఖ-లింగంపల్లి మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుస్తాయి. అలాగే ఈ నెల 11 నుంచి కాచిగూడ-విశాఖ రైలు నడస్తుంది. జనవరి 10 వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు లింగంపల్లి-విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.