కరోనా టీకా ఉచితం.. ఆ రెండు కంపెనీల ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు గుడ్ న్యూస్

కరోనా టీకా ఉచితం.. ఆ రెండు కంపెనీల ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు గుడ్ న్యూస్

Updated On : March 4, 2021 / 4:50 PM IST

Infosys, Accenture Covid Vaccination: ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్‌లో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తెలిపాయి. కేవలం ఉద్యోగులకే కాదు వారి కుటుంబసభ్యులకు అయ్యే ఖర్చుని కూడా తామే భరిస్తామని ప్రకటించాయి. ఉద్యోగులకు టీకా వేసేందుకు వీలుగా ప్రైవేటు ఆస్పత్రులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. ప్రస్తుత దశకు అర్హులైన ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులకు టీకా అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఇన్ఫోసిస్ వెల్లడించింది.

Infosys, Accenture To Cover Covid Vaccination Costs For Employees

అమెరికా కేంద్రంగా పని చేస్తున్న టెక్ దిగ్గజం యాక్సెంచర్ భారతీయ విభాగం కూడా తమ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి వ్యాక్సిన్ ఖర్చు భరిస్తామని తెలిపింది. ఇతర ప్రముఖ సంస్థలైన మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ కూడా తమ ఉద్యోగుల కోసం టీకాలు కొనుగోలు చేయాలనే దిశలో యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Infosys once again fails to beat Accenture's revenue growth; here is what ails Indian IT companies - The Financial Express

ప్రస్తుతం కేంద్రం..కొవ్యాగ్జిన్(భారత్ బయోటెక్), కోవీషీల్డ్(సీరం) టీకాలను ప్రజలకు ఇచ్చేందుకు అనుమతిచ్చింది. మార్చి 1న ప్రారంభమైన రెండో దశ టీకా కార్యక్రమంలో 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్లకు వారికి మాత్రమే వ్యాక్సినేషన్ పరిమితం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటూ ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా టీకా కావాలనుకున్న వారు ముందుగా.. కొవిన్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కాగా, దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 17వూల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆరు రాష్ట్రాల్లోనే 85.51శాతం ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటకలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే సగానికిపైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 23 రాష్ట్రాల్లో సున్నా మరణాలు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బుధవారం(మార్చి 3,2021) అక్కడ రికార్డు స్థాయిలో 9,855 కొత్త కేసులు బయటపడ్డాయి. అక్టోబరు తర్వాత ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21లక్షల 79వేల 185కి పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

చివరిసారిగా అక్టోబరు 17న రాష్ట్రంలో రోజువారీ 10వేలకు పైగా(10,259) కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన వైరస్‌.. ఇటీవల మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ముంబై, పుణె, నాగ్‌పుర్‌, ఠాణెల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ముంబైలో నిన్న(మార్చి 3,2021) 1,121 కొత్త కేసులు వెలుగుచూడగా.. పుణెలో 857, నాగ్‌పుర్‌లో 924, ఠాణెలో 818 మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు.

గడిచిన 24 గంటల్లో 42 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 52వేల 280 మంది కరోనాకు బలయ్యారు. మరోవైపు రికవరీల సంఖ్య కొత్త కేసుల కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6వేల 559 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 20లక్షల 43వేల 349కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 82వేల 343 యాక్టివ్‌ కేసులున్నాయి. యాక్టివ్ (క్రియాశీల) కేసులు అత్యధికంగా పుణె జిల్లాలో 16వేల 491గా ఉన్నాయి. ఆ తర్వాత నాగ్‌పుర్‌లో 10వేల 132, ఠాణెలో 8వేల 810 యాక్టివ్‌ కేసులున్నట్లు ప్రభుత్వం తెలిపింది.