బ్రహ్మపుత్ర కవి.. భారత రత్న భూపేన్ హజారిక

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 04:11 AM IST
బ్రహ్మపుత్ర కవి.. భారత రత్న భూపేన్ హజారిక

Updated On : January 26, 2019 / 4:11 AM IST

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం(జనవరి 25, 2019) ముగ్గురిని భారతరత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఆ ముగ్గురిలో ఒకరు అస్సామీ గాయకుడు, భూపేన్ హజారికా. హజారిక 1926, సెప్టెంబర్‌ 8న అస్సాం రాష్ట్రంలోని సాదియాలో జన్మించారు. తండ్రి నీలకాంత, తల్లి శాంతి ప్రియ హజారిక. పదిమంది సంతానంలో హజారిక పెద్దవాడు. ఆయన బాల్యం గువాహతిలో గడిచింది. హజారికకు సంగీతం ఆయన తల్లి ద్వారా వచ్చింది.

జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్ హజారిక..బ్రహ్మపుత్ర కవి, సుధాకాంత్ పేరుతో సుప్రసిద్ధులు. మానవత్వం, సోదరభావం, సార్వత్రిక న్యాయం ఉట్టిపడేలా ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషలు ముఖ్యంగా బెంగాలీ, హిందీలోకి  అనువాదం అయ్యాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లో అయన పాటలకు విపరీత ఆదరణ లభించింది. తన గాత్రంతో కొన్ని తరాలను ఉర్రుతలూగించారు.

12 ఏళ్ల వయసులో తేజ్‌పూర్‌లో మొట్ట మొదట చిత్ర గీతాలను పాడారు.13 ఏళ్లకే గేయరచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు అయ్యారు. మెట్రిక్యులేషన్‌ తేజ్‌పూర్‌ హైస్కూల్‌లో చదివారు. ఆల్‌ ఇండియా రేడియోలో కొంత కాలం పనిచేసారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే కొలంబియా యూనివర్సిటీ నుండి స్కాలర్‌షిప్‌ మీద న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ ‘ఆడియో, వీడియో పద్ధతులు – భారత కనీస విద్యలో చేర్చమనే అంశంపై పి.హెచ్‌.డి. చేశారు. అక్కడ పాల్‌ రోబెసన్‌ అనే పౌరహక్కుల సంఘం సభ్యుడు రాసిన గీతంతో ఆయన ఎంతగానో స్ఫూర్తి పొందారు. ఆ గీతాన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు హజారిక. యుఎస్‌ఎ నుండి తిరిగి వచ్చాక ఐపిటిఎ – ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌కి సెక్రటరీగా హజారిక పనిచేశారు. 

హజారిక పొందిన పురస్కారాలు:
1975 – జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు 
1977 – పద్మశ్రీ 
1987 – సంగీత నాటక అకాడమీ అవార్డు
1992 – దాదాసాహెబ్ ఫాల్కే
2001 – పద్మ భూషణ్
2008 – సంగీత నాటక్ ఫెలోషిప్
2012 – పద్మవిభూషణ్(మరణానంతరం)
2019 – భారత రత్న