నేను పాకిస్థాన్‌కు వెళ్తున్నది అందుకు కాదు: విదేశాంగ మంత్రి జై శంకర్
తన పర్యటనపై మీడియా చాలా ఆసక్తిని కనబర్చుతుందని..

భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అక్టోబర్ 15, 16 తేదీల్లో పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. దీనిపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆ దేశానికి వెళ్తున్నది భారత్-పాకిస్థాన్ సంబంధాలపై చర్చించేందుకు కాదని చెప్పారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సభ్యుడిగా పాల్గొనేందుకు మాత్రమే తాను పాకిస్థాన్‌కు వెళ్తున్నానని తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే భారత్ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీలోని ఐసీ సెంటర్ ఫర్ గవర్నెన్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జై శంకర్ మాట్లాడుతూ.. ఈ నెలలో పాకిస్థాన్‌కు వెళ్లేది ఎస్‌సీవో ప్రభుత్వాధినేతల సమావేశం కోసమేనని స్పష్టం చేశారు. తన పర్యటనపై మీడియా చాలా ఆసక్తిని కనబర్చుతుందని తాను అనుకుంటున్నానని, తన పర్యటన ప్రాముఖ్యత అలాంటిదని, అందుకు తగ్గట్లు వ్యవహరిస్తానని తెలిపారు.
భారత్‌లాగే పాకిస్థాన్ కూడా కూటమిలో సభ్యదేశంగా ఉందని తెలిపారు. కాగా, చివరిసారిగా పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం నుంచి 2015లో అప్పటి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వెళ్లారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జై శంకర్ వెళ్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చేశాయ్.. ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసా?