Jammu Elections 2024: జ‌మ్మూకాశ్మీర్‌లో రెండో దశ ఎన్నికలు.. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత

జమ్మూ కాశ్మీర్ లో బుధవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

Jammu Elections 2024: జ‌మ్మూకాశ్మీర్‌లో రెండో దశ ఎన్నికలు.. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత

Jammu and kashmir assembly elections 2024

Updated On : September 24, 2024 / 12:11 PM IST

Jammu and kashmir assembly elections 2024: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రెండో దశలో ఆరు జిల్లాల్లో 26 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 239 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Also Read : అమెరికా పర్యటన ముగించుకొని భారత్‌కు ప్రధాని మోదీ.. జెలెన్‌స్కీతో మరోసారి భేటీ.. ఎందుకో తెలుసా?

జమ్ము ప్రాంతంలోని రియాసీ, రాజౌరీ, పూంఛ్ జిల్లాలతో పాటు కాశ్మీర్ లోయలోని శ్రీనగర్, బుద్గాం,గండేర్బల్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళల కోసం 157 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండో దశ ఎన్నికల్లో 25.78 లక్షల మంది ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎల్ ఓసీకి దగ్గరగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అదనంగా 300 కంపెనీల పారామిలటరీ బలగాలను వినియోగిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

 

రెండో దశలో పోలింగ్ లో బరిలో నిలిచిన ముఖ్య నేతల్లో ఒమర్ అబ్దుల్లా, జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, కాంగ్రెస్ నేత తారీక్ హమీద్ కర్రా తదితరులు ఉన్నారు.ఇదిలాఉంటే.. జమ్మూకాశ్మీర్ లో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడత పోలింగ్ 24 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18న పూర్తయింది. 61.38శాతం మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. రెండో దశలో 26 స్థానాలకు రేపు (బుధవారం) ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది.