బాబోయ్.. కిలోల కొద్దీ బంగారం.. జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ.. అందులో ఏమేం వస్తువులున్నాయంటే..
తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు సంబంధించిన బంగారం, వెండి, ఇతర ఆస్తులు, ఆస్తి పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించే ప్రక్రియ పూర్తయింది.

Jayalalithaa Assets
Jayalalithaa Assets: తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు సంబంధించిన బంగారం, వెండి, ఇతర ఆస్తులు, ఆస్తి పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించే ప్రక్రియ పూర్తయింది. కళ్లు చెదిరే బంగారు ఆభరణాలతోసహా ఆరు పెట్టెల్లో తమిళనాడుకు జయలలిత ఆస్తులను తరలించారు. భారీ భద్రత మధ్య అధికారులు పెట్టెలను తీసుకొచ్చి తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. వీటి విలువ సుమారు రూ.4వేల కోట్లు ఉండొచ్చని సమాచారం.
ప్రముఖ న్యాయవాది అప్పటి జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి 1996లో జయలలిత అక్రమాస్తులపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే జయలలితను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి జయలలిత నుండి విలువైన చరాస్తులతోపాటు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయింది. అప్పట్లో తమిళనాడులో జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో భద్రపర్చారు. అయితే, జప్తు చేసిన సమయంలో ఆస్తుల విలువ 913.14 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం వాటి విలువ రూ.4వేల కోట్లకు చేరినట్లు అనధికారికంగా తెలుస్తోంది.
జయలలితకు వారసులమని, ఆ ఆస్తులను తమకే అప్పగించాలని జె.దీపక్, జె.దీప అనే వ్యక్తులు కర్ణాటక హైకోర్టులో వేసిన అర్జీని ఇదివరకే కోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్ ను తోసిపుచ్చింది. రెండు వారాల క్రితం బెంగళూరులోని స్పెషల్ కోర్టు బెంగళూరులోని జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. కోర్టు నిర్ణయం మేరకు నాలుగు వేల కోట్ల విలువైన ఆస్తులను తీసుకొచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆరు ట్రంకు పెట్టెలతో బృందాన్ని పంపించింది. ఆస్తులు, ఆస్తి పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించడం శనివారం పూర్తయిందని కర్ణాటక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ జవళి ప్రకటించారు.

gold sword
జయలలితకు చెందిన ఆస్తుల్లో 27కిలోల బంగారు, వజ్రాభరణాల్లో 1.5కిలోల స్వచ్చమైన పుత్తడి కత్తి కూడా ఉంది. బంగారు కిరీటం, వజ్రాలను నెమలి ఆకారంలో పొదిగిన ఒడ్డానం, జయలలిత రూపంలో ఉన్న బంగారు బొమ్మతోపాటు.. 11,300 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీలు, ఎనిమిది వీసీఆర్ లు, 740 జతల పాదరక్షలు, 610 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8376 పుస్తకాలు ఇలా మొత్తం కలిపి 1,606 వస్తువులను ఆరు ట్రంకు పెట్టెల్లో తీసుకొచ్చి తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.
జయలలిత అనారోగ్యంతో 2016 డిసెంబర్ 5న చెన్నైలో కన్నుమూశారు.