కమల్‌నాథ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరైన జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఆ జర్నలిస్ట్ కూతురు మార్చి-17న లండన్ నుంచి భారత్ కు వచ్చినట్లు తెలిసింది.కూతురు ద్వారానే జర్నలిస్ట్ కు సోకినట్లు తెలుస్తోంది. మార్చి-20న తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించేందుకు కమల్ నాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు వైరస్ వ్యాప్తి చెందే అవకాలను తగ్గించేందుకు ఆ మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులు,అధికారులు అందరూ ఇప్పుడు క్వారంటైన్(నిర్భందం)అవ్వాల్సి ఉంటుంది. అయితే కమల్ నాథ్ కూడా తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 14కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా సోకినవారిసంఖ్య 562కి చేరింది.
కరోనా కేసులు దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ… వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజులు(ఏప్రిల్-14,2020)వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ ను ప్రకటించారు. అత్యవసర,ముఖ్యమైన సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. ఈ 21రోజులు మనకు చాలా ముఖ్యమైనవని,లాక్ డౌన్ ఆదేశాలను కనుక ప్రజలు సీరియస్ గా పాటించకపోతే పరిస్థితి అదుపుతప్పి పోతుందని,దేశంపై భయంకరమైన ప్రభావం పడుతుందని మోడీ తెలిపారు. ప్రతీ నగరం,ప్రతీ పట్టణం,ప్రతీ వీధి,ప్రతీ గ్రామం లాక్ డౌన్ అవుతుందన్నారు. 21 రోజుల్లో కరోనాను నియంత్రించకుంటే చాలా కుటుంబాలు కనుమరుగవుతాయన్నారు.
లాక్ డౌన్ నిర్ణయం ప్రతీ ఇంటికీ లక్ష్మణ రేఖ అని మోడీ తెలిపారు. గీత దాటితే కరోనా వైరస్ ను ఇంట్లోకి రానిచ్చినట్లేనని మోడీ తెలిపారు. కరోనా నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం లేదని ప్రధాని తెలిపారు. 67 రోజుల్లో కరోనా వైరస్ లక్షల మందికి సంక్రమిస్తే, ఆ తర్వాతి 11 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య 2లక్షలకు పెరిగిందని మోడీ తెలిపారు. మనం ప్రతీ దశలోనూ సహనం చూపించాల్సిన సమయమిది అని మోడీ తెలిపారు. మనం తీసుకునే చర్యలే మనల్ని విపత్తుల నుంచి కాపాడతాయన్నారు.
ఈ విపత్కర పరిస్థితి పేదల జీవితాలను ఇబ్బందుల్లో పడేసిందని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిత్యావసరాల సరుకుల సరఫరాకు ఇబ్బంది రాకుండా చూస్తున్నామని మోడీ అన్నారు. తాను ప్రధానమంత్రిగా ఈ నిర్ణయం ప్రకటించడం లేదని,ఓ కుటుంబసభ్యుడిగా చెబుతున్నానన్నారు. జలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమవ్వాలని మోడీ కోరారు.
See Also | కూతురికి కరోనా రాకూడదని 2వేల 500కిలోమీటర్లు ప్రయాణించిన డాక్టర్