హేమంత్ సొరేన్ వైఫ్ కల్పనా సొరేన్ గురించి ఈ విషయాలు తెలుసా?

43 ఏళ్ల కల్పన తన భర్తతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. నిత్యం భర్త వెన్నంటే ఉంటూ చేదోడువాదోడుగా నిలిచారు.

హేమంత్  సొరేన్ వైఫ్ కల్పనా సొరేన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Kalpana Soren family education personal details here

Updated On : January 30, 2024 / 4:00 PM IST

జార్ఖండ్ కొత్త సీఎంగా కల్పనా సొరేన్ బాధ్యతలు చేపట్టే అవకాముందని వార్తలు వస్తున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ (ఈడీ) అధికారులు తనను అరెస్ట్ చేస్తే తన భార్యకు ముఖ్యమంత్రిని చేయాలని హేమంత్ సొరేన్ భావిస్తున్నారని సమాచారం. భూ కుంభకోణం, మ‌నీ లాండ‌రింగ్ కేసులో సీఎం సోరేన్ ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం కీలక నేతలతో హేమంత్ సొరేన్ భేటీ అయ్యారు. తాను జైలుకెళ్తే తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం.

కల్పనా సొరేన్ ఏం చదివారంటే..
ఈ నేపథ్యంలో కల్పనా సొరేన్ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో ఆమెకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు నెటిజనులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన కల్పన ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌తో పాటు ఎంబీఏ డిగ్రీ కూడా చేశారు. ఆమెకు ఫిబ్రవరి 2006లో హేమంత్‌ సొరేన్ తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రాష్టపతి ద్రౌపదీ మూర్ముతో కల్పన కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది. ద్రౌపదీ మూర్ము కూడా మయూర్‌భంజ్ జిల్లా వారే. 2022 రాష్టపతి ఎన్నికల్లో ద్రౌపదీ మూర్ముకు JMM మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా కల్పనా సొరేన్?

ఆత్మవిశ్వాసం ముఖ్యం
43 ఏళ్ల కల్పన తన భర్తతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. నిత్యం భర్త వెన్నంటే ఉంటూ చేదోడువాదోడుగా నిలిచారు. రాష్ట్రాభివృద్ధి కోసం తన భర్త, తాను నిత్యం తపిస్తుంటామని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. మహిళల హెల్ప్‌లైన్ 181 నంబర్‌ను మరింత ఫంక్షనల్‌గా ఎలా మార్చాలనే దానిపై ఇటీవల చర్చించుకున్నామని వెల్లడించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని కల్పన ఎల్లప్పుడు చెబుతూ ఉంటారు. ఒడిశాలో గతేడాది ఏప్రిల్ లో ఓ కాలేజీ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. “జీవితం తలకిందులైనా ఆత్మవిశ్వాసమే మనల్ని కాపాడుతుంది. డిగ్రీ చదివినా, రాజకీయ నాయకుడైనా, IAS అధికారి, పోలీసు అధికారి అయినా.. ఆత్మవిశ్వాసం లోపిస్తే, గెలిచే పరిస్థితిలోనూ ఓడిపోతార”ని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొంటారో చూడండి.