Congress: మధ్యప్రదేశ్‌లో గెలిస్తే రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ.. కాంగ్రెస్ 5 హామీలు.. ఇక తెలంగాణలోనూ ఇవే..
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ (Kamal Nath) ఇవాళ మీడియాతో మాట్లాడారు.

Kamal Nath - Revanth Reddy
Congress – Kamal Nath: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రచార హడావుడి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఇవాళ రైతులకు భారీ హామీలు ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లో గెలిస్తే రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తామని, వ్యవసాయ రుణాలను, పెండింగ్ విద్యుత్ ఛార్జీలను మాఫీ చేస్తామని ప్రకటించింది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ (Kamal Nath) ఇవాళ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలనలో రైతులపై రుణ భారం పెరిగిపోయిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 70 శాతం వ్యవసాయ ఆధారితమేనని అన్నారు. 2018 ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేశాక తాము 27 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. ఈ సందర్భంగానే రైతులకు 5 హామీలు ఇచ్చారు.
రైతులకు ఇచ్చిన 5 హామీలు
1.కృషక్ న్యాయ్ యోజన ద్వారా రైతులకు ఇన్‌పుట్ ధరను తగ్గిస్తాం
2.వ్యవసాయానికి ఉపయోగించే పంపులకు (5 హార్స్‌పవర్‌లోపు వాటికి) అదనంగా ఉచితంగా విద్యుత్ అందిస్తాం. రైతులకు నిరాంతరాయంగా 12 గంటల విద్యుత్తు అందేలా చేస్తాం
3.వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తాం
4.రైతులు నిరసన తెలిపిన సమయంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేస్తాం
5.వ్యవసాయం కోసం రైతులు వాడిన విద్యుత్తు పెండింగ్ బిల్లులను మాఫీ చేస్తాం
తెలంగాణలో..
తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ తెలంగాణలోనూ అమలు చేయనుంది. ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా 5 హామీల్లో మార్పులు, చేర్పులు చేయనుంది. ఇప్పటికే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ పలు హామీలను ఇచ్చింది.
ఇప్పటికే మధ్య ప్రదేశ్ లో 1. రూ.500కి గ్యాస్ సిలిండర్, 2. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, 3. రాష్ట్రంలో100 యూనిట్ల ఉచిత విద్యుత్, 4.రైతుల రుణమాఫీ, 5. పాత పెన్షన్ పథకం అమలు హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. ఇవాళ రైతుల విషయంలో మళ్లీ 5 ప్రత్యేక హామీలను ఇచ్చింది.