Karanam Malleswari : ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వీసీగా కరణం మల్లీశ్వరి
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్,పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46)ని నియమించారు.

Karanam Malleswari
Karanam Malleswari ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్,పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46)ని నియమించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయానికి కరణం మల్లీశ్వరి మొట్టమొదటి వీసీ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.
కాగా,శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి 2000వ సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో ఒలంపిక్స్ లో పాల్గొని భారత్ కు కాంస్య పతకం సాధించారు. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళాగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఒలింపిక్ విజయానికి ముందే.. 29 అంతర్జాతీయ పతకాలతో రెండుసార్లు వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ గా కరణం మల్లీశ్వరి నిలిచింది. ఇందులో 11 బంగారు పతకాలు ఉన్నాయి. 1999లో కేంద్రప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో కరణం మల్లీశ్వరిని సత్కరించింది. 1994లో అర్జున అవార్డు అందుకున్న మల్లీశ్వరి..1995లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని అందుకుంది.
కాగా,స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులు ఇకపై ఇక్కడ తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇటీవల తెలిపారు. వారు ఇతరత్రా మరే డిగ్రీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు పసిడి పతకాలు తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ వర్సిటీ ఏర్పాటు వెనుకున్న ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.