Amarnath yatra : కశ్మీర్ లో బస్సు ప్రమాదం..20మంది అమర్‌నాథ్ యాత్రీకులకు గాయాలు..

అమర్​నాథ్ యాత్రలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అమర్ నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు జమ్ముకశ్మీర్ ఖ్వాజీగుండ్​ వద్ద బద్రగుండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది యాత్రికులు గాయపడ్డారు.

Amarnath yatra : కశ్మీర్ లో బస్సు ప్రమాదం..20మంది అమర్‌నాథ్ యాత్రీకులకు గాయాలు..

20 Amarnath Yatra Pilgrims Injured After Bus Meets With Accident Near Kulgam

Updated On : July 14, 2022 / 2:50 PM IST

Amarnath yatra 2022: ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అమర్ నాథుడ్ని దర్శించుకునే భక్తులు ఎన్నో వ్యయప్రయాశలు పడుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రెండుసార్లు యాత్ర వాయిదా పడింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో అమర్​నాథ్ యాత్రలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అమర్ నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు జమ్ముకశ్మీర్ ఖ్వాజీగుండ్​ వద్ద బద్రగుండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది యాత్రికులు గాయపడ్డారు. వీరందరినీ అనంతనాగ్​ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారు. కాశ్మీర్ లోయలో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన రోజున ఈ ప్రమాదం జరిగింది.

JK02Y/0869 నంబర్ గల బస్సు జమ్ముకశ్మీర్ ఖ్వాజీగుండ్​ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమంయలో బస్సులో 40మంది యాత్రీకులు ఉన్నారు. భక్తులను బల్తాల్ క్యాంపువైపుకు తీసుకువెళుతుండగా ఖ్వాజీగుండ్ వద్ద ప్రమాదానికి గురి అయ్యింది. బస్సు అదుపు తప్పి అదే మార్గంలో వెళుతున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భక్తులకు కొద్దిపాటి గాయలు అయ్యాయి గానీ ఎటువంటి ప్రాణ నష్టం కలుగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు ఎడతెరపిలేని వర్షాలతో అమర్‌నాథ్‌ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం, బల్తాల్‌ మార్గాల్లో భక్తులు వెళ్లేందుకు అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. వర్షాలు తగ్గేవరకు యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇండో టిబెటన్ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) అధికారులు సమాచారం ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.ఈ విషయమై ఐటీబీపీ వర్గాలు స్పందిస్తూ “యాత్రను కొంతకాలం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం. పహల్గాం, బల్తాల్‌ మార్గాల ద్వారా వెళ్లే యాత్రికులను నిలిపివేశాం. వర్షం తగ్గాక పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. అధిక వర్షాల కారణంగా జులై 5, జులై 8న ఇప్పటికే రెండు సార్లు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.