బాలికతో పెళ్లికి నో చెప్పారని మంటల్లో కాల్చేశాడు

వయస్సు చిన్నదనే ఉద్దేశ్యంతో అమ్మాయి ఫ్యామిలీ ప్రేమ వివాహానికి నిరాకరించింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మొండితనంతో ఆ యువకుడి చేసిన పనికి టీనేజ్ వయస్సున్న బాలికతో పాటు ప్రేమికుడు మంటల్లో కాలిపోయాడు.
కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముప్పైకు దగ్గరి వయస్సున్న మిధున్ అనే వ్యక్తి ఓ టీనేజర్‌ను పెళ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడు. దానికి 17ఏళ్ల వయస్సున్న బాలిక కుటుంబం నిరాకరించింది. ఇద్దరి మధ్య వయస్సులో చాలా తేడా ఉందని ఖండించింది. పెళ్లి చేయాల్సిందేనని ఒత్తిడి పెంచడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు తమదైన స్టైల్‌లో యువకుడికి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఆ బాలిక వెంటపడనని పోలీసులకు మాటిచ్చిన యువకుడు గురువారం ఉదయం బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె తండ్రి అడ్డుపడుతున్నా బాలిక ఒంటిపై, తనపై పెట్రోల్ లాంటి లిక్విడ్ పోసి నిప్పంటించుకున్నాడు. మంటలు ఆపేందుకు వెళ్లిన బాలిక తండ్రికి కూడా మంటల్లో గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయాలైన ఇద్దరినీ ఎర్నాకులం మెడికల్ కాలేజికు తరలించారు. అప్పటికే వారిద్దరూ పూర్తిగా కాలిపోయి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.