Covid in Kerala: కేరళలో కుదుటపడుతున్న పరిస్థితులు, కరోనా ఆంక్షలు సడలింపు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంపై ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందిస్తూ..అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని పిలుపునిచ్చారు.

Corona
Covid in Kerala: కరోనా కోరల్లో చిక్కుకున్న కేరళ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. దేశంలో నమోదు అయిన కరోనా కేసుల్లో అత్యధిక భాగం కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడంపై గతంలో ఆందోళన వ్యక్తం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దాదాపుగా తగ్గింది. దీంతో రాష్ట్రంలో క్రమంగా ఆంక్షలు సడలిస్తూ ఇటీవల నిర్వహించిన కరోనా సమీక్షలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంపై ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందిస్తూ..అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు చెందిన ఉద్యోగులు ఇప్పటికే రెండు డోసుల కరోనా వాక్సిన్ తీసుకుని ఉంటే వారు ఇంటి నుండి కాకుండా ఆఫీసుకి వచ్చి పనిచేయాలని సూచించారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి కేరళ, గుజరాత్, మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, వ్యాక్సిన్ పంపిణీలో వేగవంతం కారణంగా కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వచ్చింది.
Also read: COVID 19 : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 512 కేసులు
మరోవైపు కేరళ రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ విద్యాసంస్థలను ఆదేశించింది. ఫిబ్రవరి 21 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకనుగుణంగా..ప్రత్యక్ష తరగతులకు వచ్చే విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ సూచించింది. ఇదిలాఉంటే.. కేరళలో బుధవారం 12,223 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో 1,13,798 యాక్టీవ్ కరోనా కేసులున్నాయి. కరోనా కారణంగా బుధవారం 25 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తం 63,109 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు.
Also read: Covid Review: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలన్న కేంద్రం