సరిహద్దుల్లో వెనక్కి తగ్గిన చైనా…బలగాల ఉపసంహరణ

  • Published By: venkaiahnaidu ,Published On : June 9, 2020 / 02:39 PM IST
సరిహద్దుల్లో వెనక్కి తగ్గిన చైనా…బలగాల ఉపసంహరణ

Updated On : June 9, 2020 / 2:39 PM IST

తూర్పు లఢఖ్ లోని సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించిన చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ప్రాంతం,పాట్రోలింగ్ పాయింట్ 15మరియు హాట్ స్ప్రింగ్ ఏరియా నుంచి సైనిక బలగాలను,యుద్ధంలో పాల్గొనే వాహనాలను చైనా ఉపసంహరించుకుంది. సోమవారం నుంచే చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందని సమాచారం. చైనా వెనక్కి తగ్గడంతో భారత సైనిక బలగాలు కూడా వెనక్కి తగ్గుతున్నాయి.

వివిధ లొకేషన్లలో భారత్-చైనా తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల సైనికులు ఎదురెదురు నిలిచిన మూడు ప్రాంతాల నుంచి సైనిక బలగాలు వెనక్కి తగ్గగా.. నాలుగో ప్రాంతంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇరు దేశాలకు చెందిన మిలరటీ కమాండర్ల మధ్య చర్చలు జరిగాక.. స్టాండాఫ్ పాయింట్లు తగ్గాయి. సరిహద్దు వివాదాలపై చర్చించేందుకు గత శుక్రవారం భారత విదేశాంగ తరఫున సంయుక్త కార్యదర్శి నవీన్‌ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ వూ జియాంగోతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత రోజు శనివారం లేహ్‌కు చెందిన 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్.. చైనాలోని సౌత్ జిన్‌జియాంగ్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన అనంతరం శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్‌- చైనాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. బుధవారం మరోసారి మిలటరీ చర్చలు జరగనున్నాయి.