Tej Pratap Yadav: బిహార్‌లో కొత్త పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు..! పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఇదే..!
తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటి నుండి తేజ్ ప్రతాప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Tej Pratap Yadav: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్. దీనికి జన్ శక్తి జనతా దళ్ అని పేరు పెట్టారాయన. ఇటీవల ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ బహిష్కరణకు గురయ్యారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. జనశక్తి జనతాదళ్ పార్టీ పోస్టర్‌ను అందులో షేర్ చేశారు. అందులో తనను తాను “జాతీయ అధ్యక్షుడు” అని పేర్కొన్నారు. దాని ఎన్నికల చిహ్నంగా “నల్ల బోర్డు (బ్లాక్ బోర్డ్)” ఉంది. ఈ ఏడాది చివరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పార్టీ అధికారికంగా నమోదు చేయబడినట్లు లేదా అధికారికంగా ఎన్నికల చిహ్నం కేటాయించబడినట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని పాట్నాలోని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ప్లాన్‌ను కూడా ప్రకటించారు తేజ్ ప్రతాప్ యాదవ్. బీహార్ అభివృద్ధికి అంకితమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తేజ్ ప్రతాప్ తెలిపారు. బీహార్‌లో మార్పు తెచ్చేందుకు కొత్త వ్యవస్థను రూపొందించడం తన లక్ష్యమన్నారు. ‘జన్‌శక్తి జనతా దళ్’ పార్టీ పోస్టర్‌లో ఐదుగురు ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, కర్పూరి ఠాకూర్ ల చిత్రాలు అందులో ఉన్నాయి.
కనిపించని తండ్రి ఫోటో..
అయితే తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఫోటోను మాత్రం తన పార్టీ పోస్టర్‌లో పెట్టుకోలేదు తేజ్ ప్రతాప్ యాదవ్. సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, సమూల మార్పు ఆ పార్టీ సందేశంగా వెల్లడించారు. ఇక జన్ శక్తి జనతా దళ్ పార్టీలో చేరాలనుకునే వారి కోసం పోస్టర్‌లో ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తాను మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తేజ్ ప్రతాప్ తెలిపారు. 2015లో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. మహువా తన కర్మభూమి అని, అక్కడి నుంచి ఇంకెవరు పోటీ చేసినా ప్రజలు ఓడిస్తారని చెప్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో కుటుంబ కలహాలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె రోహిణి ఆచార్య మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటి నుండి తేజ్ ప్రతాప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వరుస పోస్టులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
”నేను ఒక కూతురిగా, సోదరిగా నా విధులను నిర్వర్తిస్తున్నాను. అలాగే కొనసాగిస్తాను. నేను పదవి కోసం ఆరాటపడటం లేదు. నాకు ఎటువంటి రాజకీయ ఆశయాలు లేవు. నాకు, ఆత్మగౌరవం అత్యున్నతమైనది” అని రోహిణి ఆచార్య ఇటీవల ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
తాను 12 ఏళ్లుగా ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్టు తేజ్ ప్రతాప్ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. ఈ పోస్ట్ లాలూ కుటుంబంలో చిచ్చు రాజేసింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ పార్టీ నుంచి, కుటుంబం నుంచి కూడా బహిష్కరించారు.
Also Read: లద్దాఖ్ అల్లర్లు.. ఉద్యమ నేత సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్..
हमलोग बिहार के संपूर्ण विकास के लिए पूर्ण रूप से समर्पित और तत्पर हैं। हमारा मकसद बिहार में संपूर्ण बदलाव कर एक नई व्यवस्था का नव निर्माण करना है।
हमलोग बिहार के संपूर्ण विकास के लिए लंबी लड़ाई लड़ने को तैयार हैं।#tejpratapyadav #janshaktijantadal #biharelection pic.twitter.com/GxsQHw0WqQ
— Tej Pratap Yadav (@TejYadav14) September 25, 2025