OMG: కేరళ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్.. సముద్రంలో పడిపోయిన విషపూరిత రసాయనాలు..!

కేరళ రాష్ట్రం కొచ్చి తీరానికి దాదాపు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియన్ జెండా కలిగిన ఓ కంటైనర్ షిప్ సముద్రంలో మునిగిపోయింది.

OMG: కేరళ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్.. సముద్రంలో పడిపోయిన విషపూరిత రసాయనాలు..!

Liberian cargo ship

Updated On : May 25, 2025 / 4:20 PM IST

కేరళ రాష్ట్రంలోని కొచ్చి తీరానికి దాదాపు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియన్ జెండా కలిగిన ఓ కంటైనర్ షిప్ శనివారం ప్రమాదంలో చిక్కుకుంది. 26 డిగ్రీల మేర ఓ వైపునకు ఒరిగిపోయింది. దీంతో నౌకలోని చమురు కంటెయినర్లలో కొన్ని సముద్ర జలాల్లో పడిపోయాయి. కంటెయినర్లను, అందులో నుంచి బయటకు వచ్చిన ఇంధనం తీరంవైపునకు వస్తే తాకొద్దని ప్రజలకు కేరళ విప్తత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం ఉదయం నాటికి షిప్ పూర్తిగా మునిగిపోయింది. అందులోని కంటెయినర్లు సముద్ర జలాల్లో పడిపోయాయని అధికారులు తెలిపారు.

 

ప్రమాదం సమయంలో షిప్‌లో మొత్తం 24మంది సిబ్బంది ఉన్నారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. భారత కోస్ట్ గార్డ్ సిబ్బందికి మధ్యాహ్నం 1.25గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుజాత, ఐసీజీఎస్ అర్న్వేష్, ఐసీజీఎస్ సాక్షం నౌకలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగడంతో శనివారం సాయంత్రానికి నౌకలోని 21 మందిని సురక్షితంగా నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం మిగిలిన ముగ్గురు (షిప్ కెప్టెన్, చీఫ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్) సిబ్బందిని సురక్షితంగా తీసుకొచ్చారు.

 

సమాచారం ప్రకారం.. విఝింజమ్‌ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరిన 184 మీటర్ల పొడవు 25.3 మీటర్ల బీమ్ కలిగి ఉన్న ఎంఎస్‌సీ ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్‌ చేరుకోవాల్సి ఉంది. ఇందులో మొత్తం 640 కంటెయినర్లు ఉన్నాయి. ఆదివారం ఉదయం నౌక పూర్తిగా బోల్తాపడిందని భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ వర్గాలు ధృవీకరించాయి. తెల్లవారు జామున మరిన్ని కంటెయినర్లు సముద్రంలో పడిపోయాయని, అవి రెండు రోజుల్లో కేరళ తీరానికి, ముఖ్యంగా అలప్పుజ, ఎర్నాకుళం మధ్య తీరాన్ని చేరుకుంటామని అంచనా వేస్తున్నారు. అయితే, తీరానికి కొట్టుకొచ్చిన కంటెయినర్లను ప్రజలెవరూ తాకవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి.

సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, బలమైన గాలులు వీయడం వల్ల ప్రమాదానికి నౌక ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. నౌకను కొచ్చి తీరానికి తీసుకొచ్చేందుకు భారత నేవీ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. నౌక బోల్తా పడిన తరువాత.. ముఖ్యంగా ఆదివారం తెల్లవారు జాము నుంచి వేగంగా సముద్ర జలాల్లో మునిగిపోవడం ప్రారంభమైంది. దీంతో నావికాదళం చేపట్టిన చర్యలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని తెలుస్తుంది.