బతికినంతకాలం “రాయల్ బెంగాల్ టైగర్” లానే బతుకుతా…మమత

Mamata Banerjee వెస్ట్ బంగాల్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బెంగాల్ సంస్కృతికి మమతా బెనర్జీ పాలనలో ముప్పు వాటిల్లిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యానించగా..బంగాల్లో మత విభజన ఉండదని, అన్ని వర్గాల ప్రజలు సామరస్యంగా కలిసే ఉంటారని బీజేపీపై ప్రతిదాడికి దిగారు మమతా బెనర్జీ. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బంగాల్ లో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు.
మంగళవారం బీర్భూమ్ జిల్లాలోని తారాపీఠ్ నుంచి పరివర్తన్ యాత్ర రెండో దశను ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…బెంగాల్‌కు ఉన్న గొప్ప సంస్కృతి, వారసత్వం మమతా బెనర్జీ పాలనలో ప్రమాదంలో పడింది. బీజేపీ మాత్రమే వీటిని కాపాడగలదు. బయటివారు.. లోపలివారు అంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఒక్కొక్కరిపై ముద్రలు వేస్తోంది. ఇది సిగ్గుచేటు. లోపలి వ్యక్తులు-బయటి వ్యక్తులు అనే సంస్కృతి బెంగాల్ ది కాదు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించిన నేల సంస్కృతి కాదు. రాష్ట్ర రాజకీయాలను టీఎంసీ నేరపూరితం చేసిందని నడ్డా విమర్శించారు. మా, మాటి, మనుష్(అమ్మ, నేల, ప్రజలు) అని నినాదమిచ్చే టీఎంసీ.. నియంతృత్వం, దోపిడీ, బుజ్జగింపు రాజకీయాల స్థాయికి దిగజారిపోయిందని ఆరోపించారు. బెంగాల్‌లో నిజమైన మార్పుని బీజేపీనే తీసుకొస్తుందన్నారు.
ఇక, బీజేపీపై ఎదురుదాడికి దిగారు సీఎం మమతా బెనర్జీ. తూర్పు బర్ధమాన్ ,ముర్షీదాబాద్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీల్లో ప్రసంగించిన మమత..బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బంగాల్లో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. బీజేపీకి ఓటేసినందుకు త్రిపుర ప్రజలు చింతిస్తున్నారన్నారు. బెంగాల్‌ను బంగాలీలే పాలిస్తారని.. గుజరాత్ నుంచి వచ్చేవారు కాదన్నారు. తమ రాష్ట్రంలో మత విభజన ఉండదని, అన్ని వర్గాల ప్రజలు సామరస్యంతో జీవిస్తారని చెప్పారు. బెంగాల్‌ను మరో గుజరాత్ కానివ్వబోమని మమతా స్పష్టం చేశారు.
ఫైవ్‌స్టార్ బస్‌లో రాష్ట్రేతరులు బెంగాల్‌ను సందర్శిస్తున్నారని దీదీ దుయ్యబట్టారు. ఈ స్ధానికేతర నేతలు, ఫైవ్‌స్టార్ బాబులు భారీ వాహనాలతో తిరుగుతున్నారు. బెంగాల్‌లో నివసించని వీరంతా ఫైవ్‌స్టార్ హోటళ్ల నుంచి తెప్పించిన ఆహారాన్ని పేదల ఇండ్లలో తింటూ ఫోటోలు ఫోజులు ఇస్తున్నార’ని ఎద్దేవా చేశారు. వీరు పేదల అనుకూల నేతలా అని ప్రశ్నించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇటీవల నవద్వీప్‌లో పార్టీ రథయాత్రను ప్రారంభించి రైతులతో కిచిడి తిన్న నేపథ్యంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బయటి వ్యక్తులు రాష్ట్రంలోకి వచ్చి పేదల ఇళ్లలో తినడం.. కేవలం ఫొటో షూట్ కోసమేనన్నారు.
కొంతమంది పార్టీని వదిలినంత మాత్రాన తానేమీ బలహీనంగా లేనన్నారు మమత. తాను బలంగా ఉన్నానన్నారు. తాను జీవించి ఉన్న సమయం వరకు తల ఎత్తుకొని నడుచుకుంటానన్నారు తాను బతికినంతకాలం రాయల్ బెంగాల్ టైగర్ లాగా జీవిస్తాను అని మమత వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే తాను సహించనని, అందుకే కొంతమంది పార్టీని వీడుతున్నారని అన్నారు. వారికి టీఎంసీ టికెట్ లభించదని ముందే తెలుసని చెప్పారు. వారు లేకుంటేనే పార్టీ మెరుగ్గా ఉంటుందని అన్నారు. బీజేపీ ఇచ్చే డబ్బు తీసుకోవాలని, అయితే ఓటు మాత్రం తనకే వేయాలని ప్రజలకు సూచించారు. 294 స్థానాలున్న వెస్ట్ బెగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.