Mamata Banerjee: అతడికి మరణశిక్ష వేయాల్సిందే.. హైకోర్టుకు మమతా బెనర్జీ సర్కార్
అతడికి మరణశిక్ష విధించకుండా జీవితఖైదు విధించడం పట్ల మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Mamata Banerjee
కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ వాదించినప్పటికీ సీల్దా కోర్టు దోషికి జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే.
అతడికి మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది.
మరోవైపు, మాల్దా జిల్లాలో ఇవాళ జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష విధించకుండా జీవితఖైదు విధించడం పట్ల మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆర్జీకర్ కేసులో దోషికి మరణశిక్ష విధించాలని తాను మొదటి నుంచి కోరుతూనే ఉన్నానని మమతా బెనర్జీ చెప్పారు. ఎవరైనా ఇంతటి రాక్షసత్వం ప్రదర్శిస్తూ అనాగరికంగా వ్యవహరిస్తే అతడి పట్ల సమాజం మానవత్వాన్ని ప్రదర్శించాలా అని ఆమె ప్రశ్నించారు. సమాజంలోని మహిళల పట్ల మానవత్వంతో మెలగాలని అన్నారు.
జీవిత ఖైదు అంటే ఏమిటని ఆమె ప్రశ్నించారు. రెండు, మూడేళ్లపాటు దారుణమైన నేరాలకు పాల్పడినప్పటికీ కొందరు నిందితులు పెరోల్‌పై విడుదలవుతున్నారని ఆమె గుర్తుచేశారు. ఆర్జీకర్ ఆసుపత్రి కేసులో వచ్చిన తీర్పుతో తాను నిజంగా షాక్ అయ్యానని తెలిపారు. ఒక నేరస్థుడి విడుదల చేస్తే, అతడికి శిక్షపడకపోతే అతడు మళ్లీ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని చెప్పారు.