సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ హర్షం.. భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టిన ఉద్యమనేత

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ హర్షం.. భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టిన ఉద్యమనేత

manda krishna madiga: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని తీర్పు ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును పేదవర్గాలకు అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. తాము చేసిన పోరాటం విజయం సాధించిందని ఉద్వేగానికి లోనయ్యారు.

”న్యాయం వైపు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మొక్కవోని దీక్షతో ఎమ్మార్పీస్ పోరాటం చేస్తోంది. జాతిని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎమ్మార్పీస్ ఉద్యమకారులు అమరులయ్యారు. వారికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. ఎంతో మంది స్వార్థపరులు అడ్డుపడినా న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో సమాజం యావత్తు మావైపు నిలబడింది. ఎమ్మార్పీఎస్ కు అండగా నిలబడ్డ అన్నివర్గాల పెద్దలకు ధన్యవాదాలు. మాకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, రఘునంద్ రావు, ఈటల రాజేందర్ ధన్యవాదాలు. వర్గీకరణ చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామ”ని మందకృష్ణ మాదిగ అన్నారు.

Also Read : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

చంద్రబాబు వల్లే మాకు న్యాయం జరిగింది..
చంద్రబాబు సీఎంగా ఉండడం వల్ల ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని మందకృష్ణ మాదిగ విశ్వాసం వ్యక్తం చేశారు. ”షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసిన చంద్రబాబే.. ఈనాడు తీర్పు వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు, విద్యావకాశాలు మాకు వచ్చేవి కాదు. ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లే మాకు ఈనాడు న్యాయం జరిగింద”ని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.