మావోల బీభత్సం : 27 వాహనాలకు నిప్పు

మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన అనంతరం మావోయిస్టుల కోసం పోలీస్ అధికారులు ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నారు.
రోడ్డు నిర్మాణాలకు వినియోగించే ట్రాక్టర్లు, జేసీబీలకు మావోలు నిప్పు పెట్టారు. రోడ్డు పనులు నిలిపివేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు కరపత్రాల ద్వారా గతంలో హెచ్చరించారు. వీటిని పట్టించుకోని మహారాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో భాగంగా.. రోడ్డు నిర్మాణ పనులను వారం రోజుల నుంచి కొనసాగిస్తోంది. హెచ్చరించినా రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయకుండా పనులను కొనసాగిస్తుండటంతో తమ నిరసన వ్యక్తం చేస్తూ.. 27 వాహనాలను తగలబెట్టారు మావోయిస్టులు.
ఈ వాహనాలు ఉన్న ప్రాంతానికి మే 1వ తేదీ ఉదయం చేరుకున్న 50మంది మావోలు.. పనిచేస్తున్న కార్మికులను భయపెట్టి తరిమివేశారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు మావోలను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
Maharashtra: Naxals have set ablaze 27 machines and vehicles at a road construction site in Kurkheda of Gadchiroli district. pic.twitter.com/62c6iNuJU2
— ANI (@ANI) May 1, 2019