లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను చంపి, బాక్సులో పెట్టి, కాల్చేసి, బూడిదను తీసుకెళ్లి..
పరిహార్‌ను అతడి లివ్ ఇన్ పార్ట్‌నర్ ప్రీతి డబ్బు అడుగుతూ ఒత్తిడి చేసింది. ఇప్పటికే పరిహార్ వద్ద లక్షల రూపాయలు తీసుకుంది.
Preethi, Parihar (Image Credit To Original Source)
- ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘటన
- దారుణానికి పాల్పడ్డ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
- అతడికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు
Jhansi: ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తన లివ్ ఇన్ పార్ట్‌నర్ (35)ను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని లోహపు పెట్టెలో ఉంచి నిప్పంటించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి పేరు పరిహార్. అతడికి రెండు పెళ్లిళ్లు జరిగాయి. తొలి భార్య సిప్రీ బజార్ ప్రాంతంలో, రెండో భార్య సిటీ కోత్వాలీ ప్రాంతంలో ఉంటోంది. వారిద్దరితో పాటు అతడికి లివ్ ఇన్ పార్ట్‌నర్ కూడా ఉంది.
పరిహార్‌ను అతడి లివ్ ఇన్ పార్ట్‌నర్ ప్రీతి డబ్బు అడుగుతూ ఒత్తిడి చేసింది. ఇప్పటికే పరిహార్ వద్ద లక్షల రూపాయలు తీసుకుంది. ఇంకా అడుగుతుండడంతో ఆమెను చంపిన పరిహార్, మృతదేహాన్ని కాల్చిన తరువాత బూడిదను సంచుల్లో సేకరించి నదిలో పడేశాడు. మిగిలిన అవశేషాలను లోహపు బాక్స్‌లో ఉంచాడు. ఆ బాక్సును తన రెండో భార్య గీత ఇంటికి పంపాని ప్లాన్ వేసుకున్నాడు.
పరిహార్ తన కుమారుడు నితిన్‌కు ఫోన్ చేశాడు. తర్వాత బాక్సును గీత ఇంటికి తరలించేందుకు లోడర్‌ను అద్దెకు తీసుకున్నాడు. నితిన్‌ను, అతడి స్నేహితులను బాక్స్‌తో పాటు ఇంటికి పంపాడు. అయితే, లోడర్ డ్రైవర్ జయసింగ్ పాల్ బాక్స్ లోపలి వస్తువులపై అనుమానం వ్యక్తం చేశాడు. నితిన్ ప్రవర్తన కూడా అనుమానం కలిగించింది. బాక్స్ దింపిన తర్వాత జయసింగ్ పాల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశాడు.
లోడర్ డ్రైవర్ ఏమన్నాడు?
“సరుకు తరలించాలని రూ.400కు లోడర్‌ను అద్దెకు తీసుకున్నారు. బాక్స్ విషయంలో ఏదో తేడా అనిపించింది. మొదట తీసుకెళ్లడానికి నిరాకరించాను. చివరకు తీసుకెళ్లాను. ఇంటికి చేరిన తర్వాత అనుమానం మరింత పెరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను” అని లోడర్ డ్రైవర్ చెప్పాడు.
పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకుని బాక్సును తెరిచారు. లోపల కాలిపోయిన మానవ అవశేషాలు, ఎముక ముక్కలు, బొగ్గులాంటి పదార్థాలు కనిపించాయి.
“తనిఖీలో మానవ అవశేషాలు, కాలిన పదార్థాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. తదుపరి విచారణ జరుగుతోంది. నిందితుడి రెండో భార్య గీత తెలిపిన వివరాల ప్రకారం.. పరిహార్ లివ్ ఇన్ పార్ట్‌నర్ డబ్బుల కోసం వేధిస్తోంది. ఘటనాస్థలి నుంచి సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నాం. నితిన్ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది” అని నగర ఎస్పీ ప్రీతి సింగ్ చెప్పారు.
