ఎవరీ మాధవీలత? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన “చీనాబ్” నిర్మాణం కోసం.. 17 ఏళ్ల పాటు కృషి చేసిన తెలుగు మహిళ

వందేళ్ల నాటి కలను సాకారం చేశారు.

ఎవరీ మాధవీలత? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన “చీనాబ్” నిర్మాణం కోసం.. 17 ఏళ్ల పాటు కృషి చేసిన తెలుగు మహిళ

Madhavi Latha

Updated On : June 8, 2025 / 3:53 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన “చీనాబ్”ను ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఈ వంతెన పూర్తి కావడానికి తన జీవితంలో 17 సంవత్సరాల పాటు కృషి చేశారు ఓ తెలుగు మహిళ.

జియో టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఆమె ఈ ప్రాజెక్టులో పనిచేశారు. ఆమె పేరు గాలి మాధవీలత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పూర్వ విద్యార్థిని అయిన మాధవి IIScలో మొదటి మహిళా ఫ్యాకల్టీ. మాధవీలతది ఓ సాధారణ రైతు కుటుంబం. 1992లో జేఎన్‌టీయూలో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు.

Also Read: బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తక ఆవిష్కరణ.. ప్రముఖుల ఆసక్తికర కామెంట్స్

వరంగల్‌లోని నిట్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. 2000లో ఐఐటీ-మద్రాస్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ సాధించారు. విద్యాభ్యాసం సమయంలో ఆమె కనబర్చిన ప్రతిభకు పలు పురస్కారాలు కూడా దక్కాయి.

చీనాబ్ బ్రిడ్జిని నది సాధారణ నీటిమట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇది జమ్మూకశ్మీర్‌, రియాసి జిల్లాలోని బక్కల్, కౌరి గ్రామాలను అనుసంధానిస్తుంది. ఆ ప్రాంతాల్లో బ్రిడ్జిని నిర్మించడమంటే పెద్ద సవాలే. క్లిష్టమైన భూభాగంతో పాటు అక్కడ ఉండే ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ వేయాల్సి ఉంటుంది.

అంతేగాక, అది మారుమూల ప్రదేశం కావడంతో మరిన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. వాటన్నింటినీ అధిగమించి మాధవీ లత ఆఫ్‌కాన్స్‌ సంస్థతో కలిసి ప్లాన్, డిజైన్ వేశారు. వంతెన నిర్మాణంలో ఎదురయ్యే ఆటంకాలను ప్రణాళికాబద్ధంగా అధిగమించారు. మాధవీలత టీమ్‌ “డిజైన్ యాజ్ యూ గో” అనే ప్రక్రియను ఫాలో అయింది.

వంతెన ప్రారంభం వేళ ముందుగా చేసిన సర్వేల్లో పలు రాళ్లు కనపడలేదు. వంతెన నిర్మాణం సమయంలో ఎదురవుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆమె టీమ్ ఎప్పటికప్పుడు డిజైన్‌లో మార్పులు చేసింది. బ్రిడ్జి స్థిరత్వాన్ని పెంచడంలో భాగంగా రాక్ యాంకర్ల రూపకల్పనతో పాటు వాటిని అమర్చాల్సిన చోట్లపై మాధవీలత ఇచ్చిన సలహాలు చాలా విలువైనవి.

భూకంపాలు, వరదల వంటి వాటిని తట్టుకుని సైతం నిలబడేలా దీన్ని నిర్మించారు. ఈఫిల్ టవర్ కంటే ఈ బ్రిడ్జి 35 మీటర్ల ఎత్తు ఎక్కువ. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2.86 కోట్ల కిలోల స్టీల్‌ను వాడారు. వందేళ్ల నాటి కలను సాకారం చేశారు.