భయంతోనే బిల్లు : ఈబీసీ కోటాపై కాంగ్రెస్ కామెంట్

కీలకమైన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుని ఇంత హఠాత్తుగా ఎందుకు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ బీజేపీని ప్రశ్నించారు. అగ్రకులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తప్పుకాదని, కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా బిల్లుని తీసుకురావడం సమంజసం కాదన్నారు. రాజ్యసభలో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆనంద్ శర్మ కేంద్రం తీరుని తప్పుపట్టారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని, అందుకే భయంతో ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆనంద్ శర్మ ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే ఈబీసీ బిల్లు తెచ్చారని ఆయన విమర్శించారు.
బీజేపీ మైండ్ సెట్ మారాలని ఆనంద్ శర్మ అన్నారు. మాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని, ఎవరిని శత్రువుల్లా భావించడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ చెప్పిన అచ్చేదిన్.. ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురుచూశారని అన్నారు. స్వతంత్ర భారతంలో ప్రజలందరికి భద్రత ఉండాలని నెహ్రూ అన్నారని శర్మ గుర్తు చేశారు. ఈబీసీ బిల్లును తాము తప్పుపట్టడం లేదన్న ఆయన రిజర్వేషన్ల చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. శతాబ్ధాలుగా సామాజిక అన్యాయానికి గురైనవారిని అభివృద్ధి చేసేందుకే రిజర్వేషన్లు కల్పించారని, ఆ ఉద్దేశంతోనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు.
గతంలో రెండుసార్లు ఇలాంటి బిల్లును సుప్రీంకోర్టు కొట్టిపారేసిందని శర్మ అన్నారు. ఈబీసీ బిల్లును బీజేపీ ఎందుకు తెచ్చిందో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నాలుగేళ్లుగా కోటి 10లక్షల ఉద్యోగాలను కోల్పోయారని అన్నారు. ఉద్యోగాలే లేనప్పుడు, రిజర్వేషన్ ఎలా కల్పిస్తారని ప్రవ్నించారు. పీఎస్‌యూల్లో ఉద్యోగాలు మరీ దారుణంగా పడిపోయాయన్నారు. ఒకప్పుడు రిజర్వేషన్లపై సుదీర్ఘంగా చర్చించేవారని, కానీ ఇప్పుడు 24గంటల్లోనే బిల్లును పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం లేదని అడిగిన ఆనంద్ శర్మ.. ఆ బిల్లును కూడా లోక్‌సభలో పాస్ చేయించాలని డిమాండ్ చేశారు.
అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 124వ రాజ్యాంగ సవరణ బిల్లుని తీసుకొచ్చింది. ఇప్పటికే లోక్‌సభలో ఈబీసీ బిల్లు పాస్ అయ్యింది. రాజ్యసభలోనూ పాస్ అయితే బిల్లు చట్టంగా మారనుంది. తొలిసారిగా అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడినవారు రిజర్వేషన్లు పొందుతారు.
* వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఎంతమంది ఉన్నారో గణాంకాలు ఉన్నాయా?
* బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కల్పన లేదు
* మోదీ హయాంలో 11మిలియన్ల ఉద్యోగాలకు కోత పడింది
* ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఏటికేడు తగ్గిపోతున్నాయి
* విస్తృతంగా చర్చ జరగాల్సిన బిల్లుని హడావుడిగా తీసుకొచ్చారు
* రాజ్యాంగపరంగా తలెత్తే సమస్యల గురించి ప్రభుత్వం ఆలోచించినట్లు లేదు
* ప్రభుత్వ చర్యల వల్ల కొన్ని వర్గాల్లో అభద్రత నెలకొంది
* మీరు ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో ఘనమైన హామీలు ఇచ్చారు
* 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, మద్దతు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు
* రాజ్యాంగంలో తలెత్తే సమస్యల గురించి ప్రభుత్వం ఆలోచించినట్లు లేదు