ప్రయాణికులకు విజ్ఞప్తి: ప్లాస్టిక్ వద్దు..ఆకు గిన్నెల్లో ఆహారమే ముద్దు

ప్లాస్టిక్ వద్దు..ఆకుల్లో ఆహారం అందుకోండి..ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వే జోన్ అధికారులు. రైల్లే స్టేషన్ లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రయాణీకులకు సూచిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక చర్యల్ని చేపట్టారు. అంతేకాదు..ప్లాస్టిక్ వద్దు అనే అధికారులు ప్రకృతి సహజమైన ఆకుల్ని వాడాలని పదే పదే చెబుతున్నారు. దీని కోసం ఎంపీ రత్లాం రైల్వే జోన్ అధికారులు చేపట్టిన చర్యల్లో భాగంగా..ఆకులతో తయారు చేసిన దొన్నె(గిన్నె)ల్ని వినియోగిస్తున్నారు.
భారత జాతి పిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా..పర్యవరణాన్ని పరిరక్షించటానికి రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలంతా ప్లాస్టిక్ వినియోగాన్ని మానేయాలని ప్రధాని మోడీ ఆగస్టు 15న విజ్నప్తిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్లాస్టిక్ వద్దు…ప్రకృతి సహజమైనవే ముద్దు అంటున్నారు రత్లాం రైల్వే అధికారులు.
కాగితంతో చేసిన బ్యాగులు గానీ..సింథటిక్ కు సంబంధించిన వాటికి కూడా అధికారులు చెక్ చెప్పాలంటున్నారు. స్టేషన్‌లోని స్టాల్స్, ట్రాలీలు, ఇతర యూనిట్లలో ఆహార పదార్థాలను ఆకు దొన్నెలలోనే అందిస్తున్నారు. దేశంలో ఏ రైల్వే స్టేషన్‌లోనూ లేని విధానాన్ని తొలిసారిగా ఇక్కడ అమలు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్, ఉజ్జయిని, దేవాస్, చిత్తోర్‌గఢ్, దాహాద్‌తో పాటు మరికొన్ని స్టేషన్లలో ఆకు దొన్నెలను వినియోగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.