దేశవ్యాప్త రహదారుల దిగ్భందానికి సిద్దమైన రైతులు..అన్నదాతలను ఆపేందుకు ఢిల్లీ సరిహద్దులో మేకులు

Nails on road రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాలును పోలినటువంటి రక్షణ కవచం, స్టీలు లాఠీ, హెల్మెట్ ధరించిన ప్రత్యేక పోలీసు బృందాలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లాఠీ పట్టుకున్న సమయంలో చేతివేళ్ల చుట్టు రక్షణగా ఉండేందుకు ఓ స్టీల్ తొడుగును, మరో చేతికి డాలును పోలిన తొడుగును వారు ధరించారు.
పోలీసులపై దాడులు జరగకుండా నిరసన కారులను ఆమడ దూరంలోనే ఉంచేందుకు వీలుగా వీటి రూపకల్పన జరిగినట్టు తెలుస్తోంది. ఈ లాఠీల పొడవు సాధారణ కత్తికంటే రెండింతలు ఎక్కువగా ఉంది. శుక్రవారం అలీపూర్ వద్దు రైతు నిరసనల సందర్భంగా జరిగిన దాడిలో ప్రదీప్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తనపై కత్తులతో దాడి జరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు పటిష్ట రక్షణ చర్యలకు పూనుకున్నారు.
మరోవైపు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు, టిక్రి సహా గాజీపుర్ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అంతేకాకుండా రహదారి మధ్యలో కాంక్రీట్ పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు. మొదట ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లో ఈ విధంగా ఏర్పాటు చేసిన అధికారులు.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రైతుల వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిలువరించడానికి వీటిని అమర్చినట్లు తెలుస్తోంది.
కాగా, రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ ఆందోళన చేస్తోన్న గాజీపుర్ సరిహద్దుల్లోకి ఉద్యమానికి మద్దుతుగా రైతుల దండు కదలడం వల్ల భద్రతా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు అధికారులు. డ్రోన్ల సాయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇక,సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భందానికి రైతులు సిద్దమయ్యారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఆందోళన చేస్తోన్న రైతులు తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఫిబ్రవరి-6న మధ్యాహ్నాం 12 గంటల నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు.
At Singhu today. Multiple barricades, more concrete. pic.twitter.com/HFqH5HzFVA
— Kainat Sarfaraz. (@kainisms) February 1, 2021