NDA Meeting : నితీష్ కుమార్ కే పగ్గాలు ?

NDA Meeting : బీహార్ తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్య పార్టీలు 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం సమావేశం కానున్నాయి. మధ్యాహ్నం 12:30కు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేది తేలనున్నది. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో జరుగనున్న ఎన్‌డీఏ సమావేశానికి.. జేడీయూ, బీజేపీ, హెచ్‌ఎం, వికాషీల్ ఇన్సాన్ పార్టీ నేతలు హాజరుకానున్నారు.
పాలక కూటమిలో 74 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి.. జేడీయూ కంటే 31 ఎక్కువ స్థానాలను సాధించింది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీష్ కుమార్‌నే తదుపరి ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి చాలా ముందుగా ఆయనను పాలక సంకీర్ణానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఆదివారం సీఎం అభ్యర్థితోపాటు.. ప్రమాణ స్వీకార తేదీపై చర్చించనున్నారు. నితీష్‌కుమార్‌కే మరోసారి సీఎం పీఠం బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తన కొత్త పదవీకాలంలో ఎక్కువ కాలంపాటు నిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించాలని చూస్తున్న నితీష్.. సోమవారం లేదా మరో మూడు నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. నితీష్ కుమార్ ఇప్పటివరకు 14 సంవత్సరాలు 82 రోజులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ రోజులు పనిచేసిన సీఎంగా శ్రీకృష్ణ రికార్డును కలిగి ఉన్నారు. శ్రీకృష్ణ సిన్హా 17 సంవత్సరాల 52 రోజులు సీఎంగా పనిచేశారు. నితీష్‌కుమార్ ఈ దఫా సీఎం పదవి చేపడితే ఈ రికార్డును అధిగమిస్తారు.