NDA VS INDIA: ఎన్నికల వేళ బీజేపీకి ఉన్న పాజిటివ్స్‌, నెగిటివ్స్‌ ఇవే..

I.N.D.I.A కూటమికి అనుకూల, ప్రతికూల అంశాలేంటి? స్ట్రాటజీస్‌ ఏంటో కూడా చూద్దాం..

NDA VS INDIA: ఎన్నికల వేళ బీజేపీకి ఉన్న పాజిటివ్స్‌, నెగిటివ్స్‌ ఇవే..

NDA VS INDIA

సార్వత్రిక ఎన్నికల్లో విజయం అంత ఆషామాషీకాదు. స్థానిక రాజకీయాలతో పాటు రాష్ట్రాల్లో పరిస్థితులు, దేశవ్యాప్తంగా ఉన్న వేవ్స్‌పై చాలా క్షుణ్ణంగా అంచనా వేయాల్సి ఉంటుంది. అధికార, ప్రతిపక్ష ప్రధాన కూటముల బలాబలాలు బేరీజు వేయాలి. ఈ విషయంలో ఎన్డీయే కూటమికున్న పాజిటివ్స్‌, నెగిటివ్స్‌ ఏంటి..? I.N.D.I.A కూటమికి అనుకూల, ప్రతికూల అంశాలేంటి..? ప్రాంతీయ పార్టీల స్ట్రాటజీస్‌ ఏంటి..? ఓసారి చూద్దాం..

ఏ పార్టీ అయినా ఎన్నికలకు వెళ్లే ముందు అభ్యర్థుల బలం చాలా కీలకం. ఎన్డీయేలో మోదీ ఫేస్‌ ప్రధాని అభ్యర్థి అనేది పిక్చర్‌ క్లారిటీ. కానీ.. I.N.D.I.A కూటమి దగ్గరకొస్తే.. క్వశ్చన్‌ మార్క్‌ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్‌ శ్రేణులతో సహా ముఖ్యనేతలంతా రాహుల్‌ గాంధీని ప్రధానిని చెయ్యాలని అంటాయి.

కానీ.. రాహుల్‌ మాత్రం తాను పీఎం అభ్యర్థినని గట్టిగా బయటకు చెప్పలేరు. మల్లికార్జున ఖర్గేనా, లేక మమతా బెనర్జీనా, పోనీ కేజ్రీవాలా..? అసలు I.N.D.I.A కూటమిలో ప్రధాని అభ్యర్థి ఫేస్‌ ఎవరు..? అనే సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. ఎన్నికలకు వెళ్లడానికి ప్రధాని అభ్యర్థి ఎవరనేది కూడా కీలకమే. ఈ విషయంలో బీజేపీతో పోల్చితే కాంగ్రెస్‌ చాలా వెనకబడిపోయింది.

ఈ రాష్ట్రాల్లో బలపడ్డ బీజేపీ
దేశవ్యాప్తంగా ఉత్తరాది మినహా చాలా రాష్ట్రాల్లో బీజేపీకి సరైన ఓట్‌ బ్యాంక్‌ లేదు. అయినా మోదీని మూడోసారి పీఎంను చేయాలనే సమరోత్సాహం కమలనాథుల్లో కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ , ఛత్తీస్‌గఢ్‌, ఇలా పలు రాష్ట్రాల్లో బీజేపీ బలపడింది. పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల ఓట్‌ బ్యాంక్‌ను పదిలం చేసుకోవడంలోనే మోదీ-షా వ్యూహాలు పకడ్బందీగా అమలయ్యాయి.

ఈ నమ్మకమే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెన్స్‌ను కమలనాథుల్లో పెంచేలా చేశాయి. ప్రస్తుతం బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టిపెట్టడంతో పాటు.. బలహీనంగా ఉన్న తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకోవడంపై కమలం పార్టీ క్లారిటీతో ఉంది. 400 సీట్లు టార్గెట్‌ అంటూ భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకుంది. 250కి పైగా ఎంపీ సీట్లను పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలపై గురిపెట్టి కొట్టాలన్నది కమలవ్యూహం.

కాంగ్రెస్‌ ఇంకా అయోమయంలోనే..
కానీ.. కాంగ్రెస్‌ ఇంకా అయోమయంలోనే ఉంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కష్టపడాల్సిన ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలను వదిలేసి.. ఎక్కువ సీట్లు సాధించాలనే తాపత్రయంతో తప్పటడుగులు వేస్తోంది. శత్రువును గెలవాలంటే.. అతని బలహీనతను టార్గెట్‌ చేయాలన్న సూత్రాన్ని వదిలేసింది. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌ లాంటి పెద్ద రాష్ట్రాల్లో పార్టీకి జవసత్వాలు నింపడం మానేసి.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అంటూ అవుటాఫ్‌ ఫీల్డ్‌లో యుద్ధం చేస్తోంది.

ఎన్డీయేకి ఉత్తరాది రాష్ట్రాల్లో 200కి పైగా కీలకమైన సీట్లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అలయన్స్‌కు బలమైన క్యాడర్‌ కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీలో ఎస్పీ 30 నుంచి 40 సీట్లు గెలిచినా బీజేపీకి చెక్‌ పెట్టొచ్చు. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ 20 నుంచి 25 స్థానాలు గెలుచుకున్నా ఎన్డీయేకి ప్రతికూలఫలితాలనిచ్చే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో కనీసం మూడోవంతు సీట్లను ఇండియా కూటమి రాబట్టగలిగినా .. బీజేపీకి అధికారపీఠం దూరమవుతుందన్నది విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్‌ ఆ దిశగా అసలు ప్రయత్నాలు చేయకపోవడమే గతంలో రెండు సార్లు అధికారం చేజేతులా చేజార్చుకోవడానికి కారణమని అంటున్నారు.

వ్యూహాల్లో పైచేయి
నిజానికి బీహార్‌లో బీజేపీ బలం పెంచుకుంది. నితీశ్‌లాంటివారు కూటమిలో చేరినా.. బీజేపీకి కలిసొచ్చే అంశంగానీ, పోయేదికానీ లేదు. ప్రత్యర్థి కూటమికి బీటలువారేలా చేయడం ద్వారా ఎన్నికల వ్యూహాల్లో పైచేయి సాధించినట్లయ్యిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బీహార్‌, బెంగాల్‌, ఒడిశా , తెలంగాణ, ఏపీ, తమిళనాడు , కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో 250 సీట్లకుగానూ బీజేపీ 40 నుంచి 50 సీట్లనే గెలుచుకోగలిగింది. కేవలం పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా విస్తరించి వరుస విజయాలు సాధించడంవల్లే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాగలిగింది. అలాంటప్పుడు స్ట్రాటజీల అమలులో ఇంకా మొదటిమెట్టులోనే ఉన్న కాంగ్రెస్‌ అలయన్స్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా బలమైన ఎన్డీయే కూటమి కోటను ఢీకొట్టగలదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read Also: ఏపీ రాజధానిపై కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్