వారికి వందేమాతరం గేయం చిరాకు తెప్పిస్తుందని నెహ్రూ భావించారు: లోక్‌సభలో మోదీ
“ఇప్పుడు వందేమాతరం మహిమను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కోల్పోవద్దు” అని మోదీ సభకు చెప్పారు.
Narendra Modi
Narendra Modi: భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపై నడిపించిన వందేమాతరం గేయంపై ఇవాళ లోక్‌సభలో చర్చ చేపట్టారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. జాతీయ గేయం వందేమాతరంపై అప్పట్లో ముహమ్మద్ అలీ జిన్నా లేవనెత్తిన అభ్యంతరాలను జవహర్‌లాల్ నెహ్రూ కూడా లేవనెత్తారని అన్నారు. కొన్ని మతాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నెహ్రూ రాసిన లేఖలో వందేమాతరం గేయం ముస్లింలను రెచ్చగొడుతుందని, వారికి చిరాకు తెప్పిస్తుందని చెప్పారని మోదీ అన్నారు. ఈ గేయం వాడకంపై సమీక్ష జరపాలని నెహ్రూ పేర్కొన్నారని తెలిపారు. బంకిమ్ చంద్ర చటర్జీ సొంత రాష్ట్రం బెంగాల్‌లోనే వందే మాతరం పుట్టినప్పటికీ ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని మోదీ అన్నారు.
దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ ఉన్న సమయంలో 1975లో వందేమాతరం గేయానికి 100 ఏళ్లు నిండాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లో ఉంది. దీన్ని మోదీ గుర్తుచేస్తూ.. “ఆ సమయంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. దేశభక్తులను జైల్లో వేశారు” అని అన్నారు.
“ఎమర్జెన్సీ మన చరిత్రలో చీకటి అధ్యాయం. ఇప్పుడు వందేమాతరం మహిమను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కోల్పోవద్దు” అని మోదీ సభకు చెప్పారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత “ఉత్సాహపరిచిన, ప్రేరేపించిన” మంత్రం వందేమాతరం గేయం అని మోదీ అన్నారు. బ్రిటిష్ పాలకులు ఈ గేయం ముద్రణ, ప్రచారంపై నిషేధం విధించారని గుర్తు చేశారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్లు తమ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ది క్వీన్’ను భారత్‌లో ప్రచారం చేసే ప్రయత్నాలు జరిపారన్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ వందే మాతరం రాశారని, 1905లో బెంగాల్ విభజన జరిగినా అది దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిందని అన్నారు.
