Nimisha Priya Case: ‘ఇందులో ఇండియా జోక్యం చేసుకోలేదు.’ సుప్రీంకు స్పష్టం చేసిన కేంద్రం..
యెమెన్‌లో హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషా ప్రియను విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

Nimisha Priya Case
Nimisha Priya Case: యెమెన్‌లో హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియను దౌత్యపరమైన చర్చల ద్వారా రక్షించడానికి భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. భారత అటార్నీ జనరల్ తన వాదనలు వినిపించారు. నిమిషా ప్రియకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.
చర్చలు కొనసాగించే వరకు ప్రియ ఉరిశిక్ష ఉత్తర్వును నిలిపివేయడానికి ఆమె కేసును నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సహా యెమెన్ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే, ఈ కేసులో భారత ప్రభుత్వం జోక్యం చేసుకునే సామర్థ్యం పరిమితం అని, ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలిలేవని తెలిపారు.
నిమిషా ప్రియ కేసు సంక్లిష్టమైన సమస్యగా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. యెమెన్‌లో ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవడానికి మార్గం లేదు. ఈరోజు ఉదయం కూడా యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపడం జరిగింది. నిమిషా ప్రియను విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దీంతో జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ.. యెమెన్‌లో ఆమె ప్రాణాలు కోల్పోతే అది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
నిమిషా ప్రియ న్యాయవాది, అటర్ని జనరల్ వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను జూలై 18కు ధర్మాసనం వాయిదా వేసింది. ప్రియ కేసు పురోగతి గురించి జులై 18న తమకు తెలియజేయాలని కేంద్రం, ప్రియ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.
జులై 16వ తేదీన నిమిషాకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నిమిషా ప్రియ ప్రాణాలు కాపాడాలని కేరళ సీఎం పినరయ్ విజయన్ ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆమెను విడిపించాలని కోరారు. ఆ లేఖను ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్ కు పంపించారు.