నితీశ్ సీఎం ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ !

Nitish Kumar Likely To Take Oath As Bihar CM : బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన జేడీయూ అధినేత పదవీప్రమాణం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాకున్నా ముఖ్యమంత్రి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థి ఆయనేనని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పేశారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారు.
అయితే నితీశ్ ఇంకా ఆ పనిచేయలేదు. ఎన్‌డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరిగి.. వారు ఆయన్ను తమ నేతగా ఎన్నుకున్న తర్వాతే.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతానంటున్నారు నితీశ్. NDA శాసనసభాపక్ష సమావేశం ఎప్పుడు జరుగుతుందనే దానిపైన కూడా స్పష్టత లేదు. అయితే 16వ తేదీ మంచిరోజుగా నితీశ్ భావిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ తరపున కొత్తగా ఎన్నికైన 43 మంది ఎమ్మెల్యేలతో గురువారం నితీశ్ సమావేశమయ్యారు.
శుక్రవారం బీహార్ ఎన్‌డీఏలోని నాలుగు మిత్రపక్షాల నేతలు సమావేశమై.. ప్రమాణ స్వీకార తేదీపై చర్చించనున్నారు. ఎన్నికల్లో జేడీయూను దెబ్బతీసిన ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌ను కూటమిలో ఉంచుకునేదీ లేనిదీ బీజేపీ నిర్ణయించాలని.. ఈ విషయంలో తాను చెప్పేదేమీ లేదని వ్యాఖ్యానించారు నితీశ్. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, బీహార్ గవర్నర్‌కు NDA కూటమి నేతలు అందజేశారు.