బీజేపీ పాలిత రాష్ట్రాలకేనా! : కేరళకు వరద సాయం ఇవ్వని కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : January 7, 2020 / 12:56 PM IST
బీజేపీ పాలిత రాష్ట్రాలకేనా! : కేరళకు వరద సాయం ఇవ్వని కేంద్రం

Updated On : January 7, 2020 / 12:56 PM IST

కమ్యూనిస్టు ప్రభుత్వానికి మోడీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. గతేడాది వివిధ రాష్ట్రాల్లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఏడు రాష్ట్రాలకు గానూ రూ.5,908.56 కోట్లు విడుదల చేసేందుకు సోమవారం కేంద్రం ఆమోదం తెలపింది. కర్నాటక,హిమాచల్ ప్రదేశ్,మధ్యప్రదేశ్,అస్సాం,త్రిపుర,ఉత్తరప్రదేశ్,మహరాష్ట్రలకు మాత్రమే నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన కేంద్రం ఆ లిస్ట్ లో కేరళను చేర్చకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఈ లిస్ట్ ను రెడీ చేసింది. నిధులు విడుదలైన ఏడు రాష్ట్రాలకు గాను ఐదింటిలో బీజేపీ అధికారంలో ఉంది.

సోమవారం కేంద్రం విడుదల చేసిన రూ.5908.56 కోట్లలో… కర్ణాటకకు అత్యధికంగా రూ.1869.85 కోట్లు దక్కాయి. అసోంకు రూ.616.63 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.284.93 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.1749.73 కోట్లు, మహారాష్ట్రకు రూ. 956.93 కోట్లు, త్రిపురకు రూ.63.32 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.367.17 కోట్లు మేర నిధులు విడుదలయ్యాయి. అయితే 2018, 2019లో కేరళను భారీ వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు 40 వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2019 వరదల్లో రూ. 2వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కేరళ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు విపత్తు సహాయ నిధి కింద నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది.

అయితే కేరళ ప్రభుత్వానికి కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి ఫైర్ అయ్యారు. కేంద్రం నిర్ణయం దురదృష్టకరమన్నారు. ఇంతకు ముందు కేంద్రం మధ్యంతర సాయం కింద నాలుగు రాష్ట్రాలకు రూ.3200 కోట్ల నిధులు విడుదల చేసింది. అప్పుడు కూడా కేరళ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. మధ్యంతర సాయం అందుకున్న రాష్ట్రాల్లో కర్ణాటక (రూ.1200 కోట్లు), మధ్యప్రదేశ్ (రూ.1000 కోట్లు), మహారాష్ట్ర (రూ.600 కోట్లు), బిహార్ (రూ. 400 కోట్లు) ఉన్నాయి.

రిపబ్లిక్ డే పరేడ్ శకటం విషయంలోనూ కేంద్రం కేరళ రాష్ట్రానికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే పరేడ్‌లో తమ శకటాలని ప్రదర్శించాలన్న కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ ప్రభుత్వాల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఈ రాష్ట్రాల శకటాలను వివిధ కారణాలతో అనుమతించడంలేదని వెల్లడించింది. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేరళ అసెంబ్లీలో చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం పాస్ చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించినందున రాష్ట్రాలని కేంద్రం లక్ష్యంగా చేసుకుంటోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.